మంచినీటి ట్యాంకు ధ్వంసం పై కేసు నమోదు

by Disha Web Desk 15 |
మంచినీటి ట్యాంకు ధ్వంసం పై కేసు నమోదు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలోని సోమవారం గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ ధ్వంసం చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2022 డిసెంబర్ 12వ తేదీన సోమవరం గ్రామంలోని మంచినీటి ట్యాంకును మున్సిపాలిటీ కౌన్సిల్ తీర్మానం లేకుండా, ఇంజనీరింగ్ అధికారుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండానే కూలగొట్టారు. ఈ విషయమై మూడు నెలల తర్వాత ఎట్టకేలకు మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ బి. అనిత ఈనెల 15వ తేదీన వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం గ్రామంలో మంచినీటి ట్యాంకును ధ్వంసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ట్యాంకును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. కమిషనర్ ఫిర్యాదుతో శనివారం వైరా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంకు ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన సెక్షన్లతో కేసు నమోదు అయింది.

అయితే పోలీసులు ఈ ట్యాంక్ ఎవరు కూలగొట్టారనే విషయమై ముమ్మరంగా విచారణ నిర్వహిస్తున్నారు. ట్యాంక్ స్థలం పక్కనే ఉన్న ఇంటి యజమాని తోపాటు మున్సిపాలిటీలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు విచారించినట్లు తెలిసింది. మంచినీటి ట్యాంకు శిథిలావస్థలో చేరిందని మున్సిపాలిటీ అధికారులకు గ్రామస్తుల సంతకాలతో వినతి పత్రాన్ని సమర్పించామని ఆ ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకును కూల్చి వేశారని ఆ ఇంటి యజమాని విచారణలో తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా ట్యాంకు కూల్చివేతకు సంబంధించిన పలు అంశాలపై ఔట్సోర్సింగ్ ఉద్యోగిని విచారించినట్లు తెలిసింది. అయితే మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తులు ధ్వంసం అయితే ముందుగా మున్సిపాలిటీ అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించాల్సి ఉంటుంది.

కానీ మంచినీటి ట్యాంక్ కూల్చివేత పై స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇప్పటివరకు ప్రాథమిక విచారణ కూడా నిర్వహించలేదు. ట్యాంక్ కూల్చిన వెంటనే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ మున్సిపాలిటీ అధికారులు తాపీగా మూడు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మున్సిపాలిటీ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ నిర్వహించి ఉంటే మంచినీటి ట్యాంక్ ను ఎవరి ప్రమేయంతో కూల్చివేశారో స్పష్టమయ్యేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి విచారణ నిర్వహించకుండా పోలీసు శాఖ కోర్టులో ట్యాంక్ కూల్చివేత బాల్ ను వేసి తెలివిగా తప్పించుకున్నారని వైరాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటీ అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఉంటే పోలీసులు ఈ కేసును ఛేదించడం చాలా సులువుగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసుల విచారణలో ట్యాంకు కూల్చివేతలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో బహిర్గతమవుతున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed