తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు పురస్కారం

by Disha Web Desk 2 |
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు పురస్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది. అంతేకాదు.. ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించామని తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమంగా చెప్పారు. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే అని అన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే అభిప్రాయపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తామని అధికారికంగా ప్రకటించారు.దీంతోపాటు ప్రతీ నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శమని అన్నారు. ఒక్కడిగా వచ్చి.. ఒక్కొక్కటి సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు.



Next Story

Most Viewed