10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ సభ: పర్మిషన్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ సభ: పర్మిషన్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 17వ తేదీన అగ్రనాయకులతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా.. అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే గ్రౌండ్ పర్మిషన్ కోసం కాంగ్రెస్ దరఖాస్తు చేసుకోగా.. అధికారుల నుండి రిప్లై రాలేదు. దీంతో సెప్టెంబర్ 17వ తేదీన గ్రౌండ్‌లో సభకు బీజేపీ అనుమతి ఇస్తారా లేక కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పర్మిషన్ ఇస్తారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు అనుమతి కోసం రక్షణ శాఖకు లేఖ ఇచ్చామని ఆయన తెలిపారు. కానీ సభకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సభకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వమే కుట్రదారుగా మారడం దారుణమన్నారు. ఈ నెల 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఐదు గ్యారంటీలను ప్రకటిస్తారని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ సభ ద్వారా దేశానికి గొప్ప సందేశం ఇవ్వబోతున్నామని అన్నారు.

Next Story

Most Viewed