ఇంటర్నల్ ఇష్యూస్ పక్కకు పెట్టండి..? CM రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్

by Disha Web Desk 4 |
ఇంటర్నల్ ఇష్యూస్ పక్కకు పెట్టండి..? CM రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచేందుకు పార్టీ లక్ష్యం పెట్టుకున్నదని, ఇందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల డీసీసీలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి, పార్టీ విజయానికి కృషి చేయాలని నొక్కి చెప్పారు. సర్వేలు, ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఏఐసీసీ టిక్కెట్లు ప్రకటించిందని, అభ్యర్ధులందరినీ గెలిపించాల్సిన అవసరం స్థానిక నాయకులపై ఉన్నదని వివరించారు.

జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలన్నారు. చిన్న పాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని స్పష్టం చేశారు. అలాంటి అవకాశాన్ని ఇతర పార్టీలకు ఇవ్వకుండా పార్టీ కోసం మాత్రమే పనిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేతలకు స్థాయిని బట్టి ప్రయారిటీ ఇప్పించే బాధ్యత తనదేంటూ సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లు గెలిస్తేనే, రాష్ట్రంలోని పార్టీకి మేలు జరుగుతుందని వివరించారు. ఇగోకు పోయి, అభ్యర్ధులను ఆగం చేయొద్దని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో చిన్న పాటి సమన్వయం సమస్యలను గుర్తించామని, అవి ఆయా స్థానాలకు నష్టాన్ని చేకూర్చాయన్నారు. కానీ ఇప్పుడు అవి రిపీట్ కావొద్దని ఆదేశించారు.

జిల్లాల వారీగా పర్యటిస్తా...

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తానని, కాంగ్రెస్ పార్టీపై ప్రజల మద్ధతు పెరిగేందుకు మరింత చొరవ తీసుకుందామన్నారు. ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. అయితే క్షేత్రస్థాయి నేతలు, జిల్లా స్థాయి లీడర్లు సమన్వయంతో పనిచేస్తేనే, ఎలాంటి నష్టాలు ఉండవన్నారు. కార్యకర్తల సపోర్టు ఉంటేనే పదేళ్ల పాటు పవర్ లో ఉంటామని వివరించారు. పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పొంది పవర్‌లోకి వచ్చామని, ఇప్పుడు చిన్న చిన్న తప్పిదాలతో ఛే జార్చుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తూనే, పార్టీని ఎలా ఆదుకోవాలో తనకు స్పష్టంగా తెలుసునన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పెట్టుకున్న టార్గెట్‌ను రీచ్ కావాల్సిందేనని వెల్లడించారు.


‘‘మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి...?

మెదక్ ఎంపీ సీట్ ను గెలిచి కేసీఆర్ కు చెంపచెల్లు మనిపించేలా రుచి చూపించాలని సీఎం ఆ లోక్ సభ నియోజకవర్గ కీలక నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్నా, ప్రజల మైండ్ లోకి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను స్పష్టంగా తీసుకువెళ్తే, కష్టమేమీ కాదన్నారు. పనివిభజనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలో తాను మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇలాంటి వ్యూహాన్నే అనుసరించానని వెల్లడించారు. కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే మెదక్ లో కాంగ్రెస్ ఎగిరితేనే, కార్యకర్తల ఆశయాలకు అర్ధం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహా, కాంగ్రెస్ నాయకులు నిర్మల, మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్ధి నీలం మధు ముదిరాజ్, నర్సారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పూజల హరిక్రిష్ణ, మైనంపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ’’


Next Story