అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్

by Disha Web Desk |
అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందిస్తారనే గుర్తింపు ఉంది. ఈ ఆసుపత్రి ఎదురుగా 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని అక్టోబర్ 2న గాంధీజయంతిని పురస్కరించుకొని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ పాల్గొని ఆవిష్కరిస్తారు. అనంతరం ఏర్పాటు చేసే బహిరంగసభలో జాతీయ రాజకీయాలు, మహాత్ముడిని కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రాజకీయ సంక్షోభం అలుముకుందని, దానిని పారద్రోలాల్సిన అవసరం ఉందని ప్రసంగించనున్నట్లు సమాచారం.

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అనేక దేశాలకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచారని వెల్లడించే అవకాశం ఉంది. అలాంటి గాంధీ ని వదిలి గాడ్సే ని కోలుస్తున్న దౌర్బాగ్యపు వ్యవస్థను చూస్తున్నామని కేంద్రంపై విమర్శలు గుప్పించనున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలోని పలు థియేటర్ లలో మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ను తెలియజెప్పే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని వివరిస్తూనే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని పలుపు ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ పథకాలు కావాలని కోరుకుంటున్నారని పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్... మరోసారి పునరుద్ఘటించే అవకాశం ఉంది. వ్యవసాయరంగంతో పాటు దేశంలోని అన్ని రంగాలు కుంటుపడ్డాయని అందుకు దేశంలో బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీ రావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించే అవకాశం ఉంది. ప్రజలకు ముందస్తుగా జాతీయపార్టీ పెడుతున్నట్లు హింట్స్ ఇవ్వనున్నారు కేసీఆర్.

గాంధీ విగ్రహం ఏర్పాట్లు పరిశీలన...

అక్టోబర్ 2న గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed