బిగ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి KCR.. 21 ప్రశ్నలతో రాష్ట్రంలో మరో సర్వే!

by Satheesh |
బిగ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి KCR.. 21 ప్రశ్నలతో రాష్ట్రంలో మరో సర్వే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: షెడ్యూలు ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అధికార పార్టీ రెండడుగులు ముందే ఉన్నది. ఇప్పటికే పలు సర్వేలను చేయించిన పార్టీ అధినేత కేసీఆర్.. రెండు మూడు రోజుల్లో మరో కొత్త సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. గెలుపుగుర్రాలెవరో తేల్చుకునే ప్రక్రియ మొదలైంది. సిట్టింగ్‌లందరికీ దాదాపు టికెట్లు ఇస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు.

లోకల్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఈ సారి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి, ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్, ఎంతమంది ఆశావహులు ఉన్నారు, గెలిచే పార్టీ ఏది, ఆ పార్టీలో ధీటైన అభ్యర్థి ఎవరు తదితరాలన్నింటిపై వివరాలను తెప్పించుకుంటున్నారు. అవసరమైతే అలాంటి అభ్యర్థుల్ని పార్టీలోకి చేర్చుకునే వ్యూహానికి పదునుపెట్టారు.

గెలుపు గుర్రాలకు వల విసరడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నట్లయితే వారిని ఇటువైపు ఆకర్షించడమా లేక అందులోనే ఉండేటట్లయితే గెలిచేందుకు పరోక్షంగా తగిన సహాయ సహకారాలు ఇచ్చి ఆ తర్వాత చేర్చుకోవడమా.. ఇలాంటివన్నీ ఆ పార్టీలో వినిపిస్తున్న మాటలు.

దాదాపు పాతికమంది సిట్టింగ్‌లు ఈసారి ఓడిపోతారంటూ ఇటీవల ఓ మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సరికొత్త వ్యూహంపై పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఏయే స్థానాల్లో పరిస్థితి ఎలా ఉన్నదనే వివరాలపై ఆరా తీస్తున్నది. సిట్టింగ్‌లపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లయితే వారికి బదులుగా కొత్తగా ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్నదెవరు.. ఎక్కువ మందిలో ఎవరికి ఇస్తే బెటర్ ఛాయిస్ అవుతుంది.. వీటిపైనే ఇప్పుడు అధినేత కేసీఆర్ దృష్టి సారించారు.

ఇప్పటివరకు వచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో స్పష్టత ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో మరో సర్వేకు గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఏయే అంశాలపై సర్వే ద్వారా తెలుసుకోవాలనే ఎజెండా కూడా ఖరారైంది. మొత్తం 21 ప్రశ్నలతో కొత్త సర్వే ప్రారంభం కానున్నది. వారం రోజుల పాటు జరిగే ఆ అధ్యయనంలో రిపోర్టు వచ్చిన తర్వాత తగిన వ్యూహం రెడీ అవుతుంది.

ఈ సారి హ్యాట్రిక్ గెలుపు సాధించాలన్నది ఒక అంశమైతే.. 2018 ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఏ మాత్రం తగ్గొద్దని పార్టీ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. గత ఎన్నికల్లో 'సారు.. కారు.. నూరు.. సర్కారు..' అనే నినాదాన్ని రూపొందించుకున్నా 88 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి లాక్కుని సెంచరీ మార్కును దాటేసింది. ఈసారి కూడా అంతకంటే సీట్లు తగ్గరాదనే తీరులో యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నది.

ఒకవేళ సీట్లు తగ్గితే ప్రభుత్వం పట్ల, పార్టీపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే విమర్శలకు బలం చేకూరినట్లవుతుందని భావిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏ సెగ్మెంట్‌లో ఓటమి తప్పదని తేలుతుందో సర్వే నివేదికలో వెల్లడైతే అక్కడ ఎవరికి గెలిచే ఛాన్స్ ఉన్నదో తెలుసుకుని వారికి వల వేసే ప్లాన్‌ను అమలుచేయాలనుకుంటున్నది.

ఒకవేళ అది వర్కౌట్ కానిపక్షంలో ఇతర మార్గాలేమున్నాయో కూడా క్షేత్రస్థాయి నుంచే వివరాలను రాబట్టనున్నది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపును నిలువరించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడంతో పాటు చివరి అస్త్రంగా పార్టీలోకి చేర్చుకోడానికి పావులు కదపాలనుకుంటున్నది. అదీ సాధ్యం కాకపోతే ఆ పార్టీలోనే ఉంటున్నా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఆ తర్వాత కండువా కప్పే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి.

ఒకవైపు సంక్షేమ పథకాల అమలును స్పీడ్ చేయడం, మరోవైపు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను బలహీనంగా ఉన్న సెగ్మెంట్లలో ఖర్చు చేయడం, ప్రత్యర్థి పార్టీలకు స్థానం లేకుండా చేయడానికి మైండ్‌గేమ్ మొదలుపెట్టడం, నైతికంగా డీమోరల్ అయ్యేలా వ్యూహాన్ని అమలుచేయడం.. ఇవీ బీఆర్ఎస్ మదిలో ఉన్న ఆలోచనలు.

గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్యనే పోటీ ఉండగా ఈసారి అనూహ్యంగా బీజేపీ బలపడడంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. ఇంతకాలం రాష్ట్రానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోకీ విస్తరించి జాతీయ పార్టీగా అవతరించాలని భావిస్తున్నది. తెలంగాణలో భారీ మెజారిటీ ఆ పార్టీకి ఇప్పుడు తప్పనిసరి కానున్నది.

దీనికి తోడు తెలంగాణను దేశం మొత్తానికి రోల్ మోడల్ అని గొప్పగా చెప్పుకుంటున్నందున భారీ సీట్లలో గెలుపు, అధికారాన్ని కైవశం చేసుకోవడం అనివార్యం. తెలంగాణ పథకాలు అద్భుతమైనవని చెప్పుకోవడంతో పాటు బంగారు తెలంగాణగా తొమ్మిదేళ్ళలోనూ తీర్చిదిద్దామని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నది. ప్రజల్లో వ్యతిరేకత లేదనే బలమైన సందేశాన్ని ఇతర రాష్ట్రాల్లోకి పంపించడం బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్‌గా మారింది.

ఆరు నూరైనా గతం కంటే సీట్లు తగ్గకుండా మరోసారి పవర్‌లోకి రావడం కోసం ఏమేం చేయాలనేదానిపై చాలా కాలం క్రితమే దృష్టి పెట్టింది. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యి ఇక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో గెలుపు గుర్రాలను గుర్తించి, టికెట్లు ఇచ్చి విజయం సాధించడం కత్తిమీద సాములా మారింది.

బీఆర్ఎస్ అభ్యర్థి తప్పనిసరిగా గెలవాలన్నది ఒక లక్ష్యమైతే.. గెలిచినవారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలనేది మరో లక్ష్యం. దీంతో వీలైతే ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత విజేతలంతా బీఆర్ఎస్ పార్టీవారే కావాలన్నది ఆ పార్టీ ఫైనల్ గోల్. దానికి అనుగుణంగానే చేరికల ప్రక్రియ ఊపందుకుంటుంది.

Next Story

Most Viewed