కేంద్రంపై పోరు ఉధృతం.. హైదరాబాద్ నుంచే కేసీఆర్ యాక్షన్ ప్లాన్

by Disha Web Desk 4 |
కేంద్రంపై పోరు ఉధృతం.. హైదరాబాద్ నుంచే కేసీఆర్ యాక్షన్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాలపై పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ సెకండ్ రౌండ్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ ఇకపైన తెలంగాణ నుంచే యాక్షన్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పొలిటికల్ సైడ్ నుంచి ఇప్పుడు ట్రేడ్ యూనియన్ వైపు వ్యూహం మారుతున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే రైతాంగ, కార్మిక సంఘాలను ఒక్కటి చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను హైదరాబాద్ నుంచి మొదలుపెట్టేలా ఆలోచిస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు అందులో పాల్గొనాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా సంఘీభావం తెలిపి ప్రత్యక్షంగా పాల్గొనేలా చర్చలు జరుగుతున్నాయి.

త్వరలో భేటీ

రైతాంగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో త్వరలోనే వేర్వేరుగా సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇటీవలే భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లోని రైతు సంఘాల నాయకులతో చర్చించి హైదరాబాద్ లేదా మరోచోట అంతర్జాతీయ రైతు సదస్సును నిర్వహించడంపై ఇరువురూ చర్చించుకున్నారు. అందులో భాగంగానే వచ్చే వారం హైదరాబాద్‌లోనే అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాథమికంగా ఈ నెల 13న సమావేశం నిర్వహించేలా ముసాయిదా షెడ్యూలు ఖరారైంది. కానీ అన్ని రాష్ట్రాల రైతు సంఘాల వారితో మాట్లాడిన తర్వాత తేదీ ఫైనల్ కానున్నది.

సార్వత్రిక సమ్మెకు సింగరేణి, విద్యుత్ ఉద్యోగుల మద్దతు?

కొత్త విద్యుత్ పాలసీని వ్యతిరేకిస్తున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతోనూ ఈ నెల చివరి వారంలో కేసీఆర్ చర్చలు జరిపే చాన్స్ ఉంది. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆ రంగం ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముసాయిదా బిల్లుపైన ఇప్పటికే అసమ్మతిని వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జాతీయ సమాఖ్య చర్చలు జరిపింది. దేశవ్యాప్తంగా ఉద్యమించడంపై చర్చించింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కూడా కొత్త విద్యుత్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. గతంలో నిరనసలు కూడా చేశారు. సింగరేణి గనుల్లో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం సంస్థ ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించారు. కేంద్రానికి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం, మంత్రులు కూడా కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. బొగ్గు బ్లాకుల వేలంపై నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ విభాగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు కూడా సంఘీభావం ప్రకటించి ప్రత్యక్షంగా పాల్గొనడంపై లాంఛనంగా నిర్ణయం తీసుకోనున్నారు.

భారీ స్థాయిలో ఆందోళనలకు ప్లాన్

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులతో ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హైదరాబాద్ వేదికగానే ఆందోళనలను ఉధృతం చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ నెల చివరి వారంలో ఆయా సంఘాల ప్రతినిధులతో స్వయంగా సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో నిరసనలు, ఆందోళనలకు శ్రీకారం చుట్టే యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేయనున్నారు. తొలుత రైతాంగ సంఘాలతో, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు నిర్వహించనున్నారు. సార్వత్రిక సమ్మె తర్వాత మరికొన్ని సంఘాలను సమీకరించి తెలంగాణ నుంచే భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed