మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు: పడాల జలందర్

by Kalyani |
మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు: పడాల జలందర్
X

దిశ, గొల్లపల్లి: మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీలను విమర్శించే స్థాయి మీకు లేదని బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేష్ పై బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పడాల జలందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల బీజేపీ కార్నర్ సమావేశాల్లో కట్ట మహేష్ గురుకుల పాఠశాలకు కేటాయించిన సర్వే నెంబర్ 735లో భూమి కబ్జాకు గురైందని, దానికి దమ్ముంటే హద్దులు చూపించాలని సవాల్ విసిరారు. కాగా దీనిని ఖండిస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పడాల జలందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పడాల జలందర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిని నువ్వు అని ఏకవచనంతో మాట్లాడం సరికాదని, నీ స్థాయి ఏంటి నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని కట్ట మహేష్ ని హెచ్చరించారు. మండల పరిధిలో మంత్రి చేసిన అభివృద్ధి పనులు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 50 ఎకరాలు కబ్జాకి గురైందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఈ విషయమై ఏ సవాల్ కు అయినా సిద్ధమేనని చెప్పారు. అలాగే సర్వే నెంబర్ 735 లో గుంట భూమి కూడా కబ్జాకు గురి కాలేదన్నారు. గురుకుల పాఠశాలకు సంబంధించిన 7 ఎకరాల భూమిని హద్దులు పెట్టి నిధులు కూడా కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకోసారి మంత్రి కొప్పులపై, అలాగే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తే మా కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనుకుట్ల లింగారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కచ్చు కొమురయ్య, జేరిపోతుల నరేష్, మ్యాదరి రమేష్, సిరికొండ తిరుపతి, లచ్చయ్య, గంగాధర్, రత్నం, రాజ్ గణేష్, రాకేష్, కిరణ్ ధనుంజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story