ఆదర్శ పాఠశాల గర్ల్స్ హాస్టల్లో ఏమిటీ దురవస్థ?

by Disha Web |
ఆదర్శ పాఠశాల గర్ల్స్ హాస్టల్లో ఏమిటీ దురవస్థ?
X

దిశ, ఓదెల: గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు సకల సౌకర్యాలతో అత్యంత నాణ్యమైన విద్యను అందించాలని ఓదెల మండల కేంద్రంలో ప్రారంభించబడిన మోడల్ స్కూల్.. ఉపాధ్యాయుల అలసత్వం ,విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థినీల పాలిట శాపంగా మారింది. ఓదెల మండలంలోని మోడల్ స్కూల్లో, గర్ల్స్ హాస్టల్‌లో గత నాలుగు రోజులుగా నీటి వసతి కరువై హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు అల్లాడిపోతున్నారు.

తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి సొంత గృహాలను ఆశ్రయిస్తున్నారు. టీనేజ్ పిల్లలు హాస్టల్ వదిలి సొంత ఇళ్లకు వెళ్లి తమ అవసరాలు తీర్చుకోవాల్సిన దురవస్థ దాపురించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాఠశాలలో గత నాలుగు రోజుల నుంచి బోరు పనిచేయకపోవడంతో విద్యార్థినిలకు ఈ కష్టాలు మొదలయ్యాయి. అమాయక విద్యార్థినులు తమ గోడును బయటికి వెళ్ళ బోసుకోలేక లోలోపలే కుమిలిపోతూ అవసరాల రీత్యా హాస్టల్ ను వదిలి సొంతగృహాలను ఆశ్రయిస్తున్నారు. నీటి వసతి కరువై పాఠశాలలో చదువు మానివేసి పిల్లలు అవసరాల రీత్యా సొంత ఇండ్లకు రావలసిన దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన పాఠశాల ప్రిన్సిపాల్ గానీ, హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్ గాని ఈ విషయమై తమ విద్యుక్త ధర్మాన్ని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

బోరు చెడిపోయి నీటి వసతి లేక నాలుగు రోజుల నుంచి హాస్టల్ విద్యార్థులు అల్లాడిపోతున్న వారిని పరామర్శించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మండల విద్యా అధికారి సైతం ఈ పాఠశాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆదర్శ పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది.

నిరంతర పర్యవేక్షణతో పాఠశాల బాగోగులను చూసుకోవలసిన బాధ్యత గల ఎంఈఓ విద్యార్థినుల సమస్య పరిష్కారం లో చొరవ తీసుకోకపోవడం శోచనీయం. ఈ విషయమై ఆయనను వివరణ కోరగా.. ఈ సమస్య ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని పరిష్కారానికి తగు చర్యలు చేపట్టగలనని తెలియజేశారు.

ఈ విషయమై కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సి పాల్ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌కి ఇన్చార్జిగా వ్యవహరిస్తుంది. ఈ విషయమై ఆమెను వివరణ కోరగా.. బోరు చెడిపోయింది వాస్తవమేనని దానిని రిపేర్ కు పంపించాము. అది పూర్తిగా పనికిరాదని తెలిసింది. సండే కావడం వల్ల ఆలస్యం అయింది. ఈరోజు కొత్త మోటార్ బిగించి సమస్యలు పరిష్కారం చేస్తామని ఆమె తెలిపారు.

ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో వసతుల లేమి పై దృష్టిని సారించి తమ నిరంతర పర్యవేక్షణతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story