కేటీఆర్ ఇలాకలో వైద్యులే లేని వైద్య విధాన పరిషత్

by Disha Web Desk 12 |
కేటీఆర్ ఇలాకలో వైద్యులే లేని వైద్య విధాన పరిషత్
X

దిశ, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం పేరుకే గాని ఒక్క వైద్యులు కూడా లేరని ఉన్న కాస్త వైద్య సిబ్బందిని లింగన్నపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి మండల కేంద్రంలోని రోగులకు వైద్యం అందకుండా చేశారని ఎంపీటీసీలు పేర్కొన్నారు. ముందుగా నూతనంగా ఎన్నుకోబడిన సెస్ డైరెక్టర్ నారాయణరావుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వంగ కరుణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

గంభీరావుపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ మధ్యనే సామాజిక ఆరోగ్య కేంద్రముగా మార్చడంతో గంభీరావుపేటలో ఉన్న వైద్య సిబ్బందిని లింగన్నపేటకు పంపించారని ముందు చూపు లేకుండా తప్పుతో మండల కేంద్రంలోని రోగులు వైద్యం కోసం పడరాని అవస్థలు లేవని మొర పెట్టుకుంటున్నారు. నూతనంగా విధులలో చేరిన వైద్యాధికారులు ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

సమయపాలన కూడా పాటించడం లేదని వారు ఆరోపించారు. దీనిపై అధికారులను ఎంపీపీని నిలదీయగా తొందర్లోనే ఆసుపత్రికి అవసరమైన వైద్య సిబ్బంది రాబోతున్నారని.. ఈ మధ్యనే హెడ్ నర్సు తో పాటు మరి కొంతమంది విధుల్లో చేరారని.. త్వరలోనే అవసరమైన వైద్య సిబ్బంది వస్తారని సమాధానం చెప్పారు.

సామాజిక వైద్య కేంద్రంగా మారి సుమారు నాలుగు నెలలు గడుస్తున్న ఇంతవరకు ఆస్పత్రి సూపర్డెంట్ ప్రజలకు అవగాహన కల్పించడం లేదని కనీసం రోగుల అవసరమైన ప్రధమ చికిత్స కూడా చేయలేని దుస్థితికి ఆసుపత్రి చేరింది. అనంతరం మిషన్ భగీరథ నీటిని అందించడానికి సిసి రోడ్లను తవ్వి ఎక్కడికి అక్కడ వదిలేసారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొన్ని సందర్భాల్లో వృద్ధులు గుంతలో పడిన సంఘటనలు సైతం లేక పోలేదని, దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకొని, సిసి రోడ్లను మరమ్మతులు చేసేవరకు బిల్లులు చేయకూడదని ఇరిగేషన్ ఏఈ హరిప్రియను ఎంపీటీసీ నాగారపు భాగ్య కోరారు.

అక్కడక్కడ తప్ప దాదాపు పూర్తిగా సీసీ రోడ్లను మరమ్మతులు చేయించారని.. ఎక్కడైనా మిగిలి ఉంటే త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని 15 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని విద్యాశాఖ అధికారి తెలియజేశారు.

ఎంపీఓ రాజశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధం పై ప్రత్యేక కార్యక్రమంలో చేపట్టడం జరిగిందని మండలంలోని ఎవ్వరు ప్లాస్టిక్ సంచులను కవర్లను వాడిన అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధించబడుతుందన్నారు.

ఆర్అండ్‌బిఏ ఈ సాయి తన నివేదికను చదువుతూ మండలంలోని పెద్దమ్మ నుండి లింగన్నపేట వరకు డబ్బులు రోడ్డుకు మధ్యలో నూతన బ్రిడ్జి నిర్మాణంకు అనుమతులు వచ్చాయని త్వరలోనే పనుల చేపట్టనట్లుగా తెలియజేశారు. అనంతరం ఆయా శాఖ అధికారులు తమ తమ నివేదికలు చదివి సర్వసభ్య సమావేశాన్ని మామా అనిపించారు.

కాగా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన సర్వసభ్య సమావేశం 11 గంటల వరకు ఎవరు రాకపోవడంతో ఎంపీపీ జడ్పిటిసి వచ్చిన 11:30 గంటల వరకు ఇద్దరూ.. ముగ్గురు ఎంపీటీసీలు సర్పంచులు కొంతమంది అధికారులు రాగా.. మిగిలిన వారి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది. చివరకు ఉన్న కొద్ది మందితోనే సమావేశాన్ని నిర్వహించారు.


Next Story

Most Viewed