ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వేయర్, చైన్‌మెన్

by Dishanational1 |
ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వేయర్, చైన్‌మెన్
X

దిశ, తాండూర్: భూమి సర్వే రిపోర్ట్ కోసం రూ.15 వేలు లంచం తీసుకుంటూ చైన్ మెన్ గణపతి, ల్యాండ్ సర్వేయర్ గుణవంత్ రావ్ ఏసీబీకి మంగళవారం చిక్కారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగేడ గ్రామ శివారు సర్వే నెంబర్ 128/సీ లో కరీంనగర్ జిల్లా చేకుర్తికి చెందిన గాండ్ల శంకరయ్యకు 10 ఎకరాల సాగు భూమి ఉన్నది. శంకరయ్య తన భూమిని అమ్మకానికి పెట్టారు. కొనుగదారులు భూమి విస్తీర్ణం సర్వే రిపోర్ట్ కావాలని కోరడంతో ఫీజు కట్టాడు. సర్వేయర్, చైన్ మెన్ సర్వే రిపోర్ట్ కోసం వెళ్తే రూ.20 వేలు డిమాండ్ చేయగా, రూ. 15 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. సర్వే రిపోర్ట్ కోసం ఇబ్బందులకు గురి చేయడంతో బాధిత రైతు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం రెబ్బెన తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు మాటు వేశారు. లంచం డబ్బులు సర్వేయర్ కు రూ.15 వేలు ఇచ్చేందుకు వెళ్లగా చైన్ మెన్ కు ఇవ్వమని రైతుకు సర్వేయర్ సూచించాడు. చైన్ మెన్ కు రైతు రూ.15 వేలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులో తీసుకుని విచారణ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు. ఈ దాడిలో ఏసీబీలు సీఐలు జాన్ రెడ్డి, రవీందర్, సునీల్, తిరుపతి రాజు సిబ్భంది పాల్గొన్నారు.


Next Story