హుజురాబాద్‌లో ఆ ఇద్దరికీ.. లైన్ క్లియర్ ?

by Dishanational2 |
హుజురాబాద్‌లో ఆ ఇద్దరికీ.. లైన్ క్లియర్ ?
X

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల్లో ఇద్దరు అభ్యర్థులు ఖరారయ్యానే సంకేతాలు వెలువడ్డాయి. ఏప్రిల్ 30న జమ్మికుంటలో జరిగిన బహిరంగసభలో ప్రజల్లోనే ఉంటే ఫలితం వస్తుందని, వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెప లాడటం ఖాయమని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి కేటీఆర్ సూచించడంతో ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడైన గెల్లు శ్రీనివాస్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించినప్పటికీ బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల చేతిలో పరాభవం తప్పలేదు. అయినప్పటికీ ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న గెల్లు కు షాక్ ఇస్తూ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతాడని బహిరంగ సభలో కేటీఆర్ స్పష్టం చేశారు.

అప్పటికే నియోజకవర్గంలో అన్ని తానై ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కౌశిక్ రెడ్డికి ఇటీవల ప్రభుత్వ విప్ గా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో పార్టీ అభ్యర్థి విషయంలో మార్గమం సుగమమైంది. కాగా, హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి హుజూరాబాద్ పట్టణంలో జరిగిన సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బల్మూర్ వెంకట్ ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదేనన్నారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ బరిలో వెంకట్ అభ్యర్థిత్వం వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రసంగంతో స్పష్టమైంది. 30 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ఖంగు తిన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ నియోజకవర్గ బాధ్యతలను వెంకట్ నిర్వహిస్తున్న మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి రేవంత్ హుజూరాబాద్ సభలో చేసిన ప్రకటన ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Next Story