- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గల్లీల్లో గంజాయి మత్తు.. చిత్తవుతున్న యువత

దక్షిణ కాశీగా పేరుగాంచి ప్రశాంతత, ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వేములవాడ పట్టణం నిత్యం ఏదో ఒక నేర ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఇటు పట్టణ ప్రజలు, అటు రాజన్న భక్తులు బెంబేలెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో పట్టణంలో జరుగుతున్న కొన్ని ఘటనలైతే ప్రజలు ఇక్కడ సేఫ్ జోన్‌లోనే ఉన్నారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి గంజాయి నివారణ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటి నుంచి వేములవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు గంజాయి అక్రమ రవాణా తగ్గింది. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోనూ నేరాల సంఖ్య చాలా వరకు తగ్గినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ పట్టణంలో ఒక్కసారిగా నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. దీనికి ప్రధాన కారణం గంజాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు గంజాయి ఎంత కట్టడి చేసినా నిత్యం ఏదో ఒక మూల నుంచి పట్టణంలోని ప్రతి గల్లీకి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి పట్టణంలో కొంతమంది డీలర్లు సైతం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పోలీసులు, ప్రజాప్రతినిధులు గంజాయి రవాణా, సేవించే వారి పై ప్రత్యేక నిఘా పెట్టి ప్రజల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచి ప్రశాంతత, ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవాల్సిన వేములవాడ పట్టణం నిత్యం ఏదో ఒక నేర ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఇటు పట్టణ ప్రజలు, అటు రాజన్న భక్తులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పట్టణంలో జరుగుతున్న కొన్ని ఘటనలైతే అసలు మనం సేఫ్ జోన్‌లోనే ఉన్నామా ? ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయా ? ఇక్కడ స్వేచ్ఛగా బతకగలమా ? అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి గంజాయి నివారణ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటి నుంచి వేములవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు గంజాయ్ రవాణా తగ్గింది. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోనూ నేరాల సంఖ్య చాలా వరకు తగ్గినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ పట్టణంలో ఒక్కసారిగా నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. దీనికి ప్రధాన కారణం గంజాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు గంజాయి ఎంత కట్టడి చేసినా నిత్యం ఏదో ఒక మూల నుంచి పట్టణంలోని ప్రతి గల్లీకి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి పట్టణంలో కొంతమంది డీలర్లు సైతం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మత్తు ఎక్కించే కిక్కుతో మర్డర్లు..
పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ మధ్య నమోదవుతున్న అత్యధిక కేసుల్లో సింహ భాగం గంజాయి కేసులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎంజాయ్ కోసం గంజాయి సేవిస్తున్న యువకులు మత్తులో మునిగి తేలుతూ శరీరంపై పూర్తి నియంత్రణ కోల్పోయి అసలు ఏమి చేస్తున్నారో తెలియని దుస్థితిలో తీవ్ర నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. చిన్న చిన్న గొడవలు, ఇతర కార్యకలాపాలకే కోపోద్రిక్తులై క్షణికావేశంలో నేరస్తులుగా మారుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో జరిగిన రెండు హత్య కేసుల్లో నేరస్తులు గంజాయి మత్తులో ఉండి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇవి చాలవన్నట్టు ఈ మధ్య కాలంలో పట్టణంలో జరిగిన ఆయా రకాల గొడవలకు గంజాయి మత్తే ప్రధాన కారణమని పట్టణంలో ప్రచారం జరుగుతోంది. అయితే వేములవాడ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నివారణకు స్థానిక పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గంజాయి సేవిస్తున్నా, రవాణా చేస్తున్న యువకులను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి, వినకపోతే కేసులు నమోదు చేసి చివరికి కటకటాల్లోకి పంపిస్తున్నారు. అయినప్పటికీ యువత తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని తెలుస్తుంది.
భయాందోళనలో పట్టణ ప్రజలు..
వేములవాడ పట్టణంలో నిత్యం జరుగుతున్న ఘటనలను గమనిస్తున్న పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని, ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోననీ ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో వేములవాడ పట్టణంలో జరిగిన వరంగల్ యువకుడి హత్య, తాజాగా జరిగిన ట్రాక్టర్ డ్రైవర్ పరుశరాములు హత్యలు గంజాయితో ముడిపడి ఉండడం, ఒక ఘటనలో అయితే హత్య చేసిన వ్యక్తులు ఎలాంటి అనుకు బెరుకు లేకుండా సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేసి ప్రజలకు సవాల్ విసరడం పట్టణ ప్రజల భయాన్ని మరింత రెట్టింపు చేసింది. పట్టణంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పట్టణ ప్రజలు, పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇతర ప్రాంతాల నుంచి వస్తుంది.. శేషాద్రిని రెడ్డి, ఏఎస్పీ, వేములవాడ
వేములవాడ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కడ లేదు. హైదరాబాద్‌తోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కొద్ది మొత్తంలో గంజాయి వేములవాడకు వస్తున్నట్లు సమాచారం ఉంది. వేములవాడ ప్రాంతంలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. గంజాయ్ సేవిస్తూ, రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపించాం. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో గంజాయి దొరుకుతున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వేములవాడను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడంతోపాటు నేరాల నియత్రణకు పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తాం.