మినీ స్టేడియం కల నెరవేరేనా?

by Dishafeatures2 |
మినీ స్టేడియం కల నెరవేరేనా?
X

దిశ, వెల్గటూర్ : దశాబ్ద కాలంగా మినీ స్టేడియం కోసం వెల్గటూరు వాసులు ఎదురు చూస్తున్న కల ఇప్పటికైనా నెరవేరుతుందా? అంటే అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. వెనకటికి ఒక వృద్ధ నాయకుడు మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చి మాట తప్పాడు. అప్పటి నుంచి మినీ స్టేడియం మండల వాసులకు కలగానే మిగిలిపోయింది. అయితే ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మినీ స్టేడియం నిర్మిస్తామని అనుకున్న స్థలంలోనే ముళ్లకంపలు తొలగించడం భూమిని చదును చేయటం లాంటి పనులు వారం రోజులపాటు చురుగ్గా జరిగాయి. దీంతో తిరిగి మినీ స్టేడియం నిర్మాణంపై క్రీడాభిమానుల్లో ఆశలు చిగురించాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కోటిలింగాల ప్రధాన రోడ్డును ఆనుకొని ఏడెకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలం ఉంది. తమ్మళ్ల కుంటగా పిలుచుకునే ఈ స్థలం ఇన్నాళ్లు పడావుగా ఉంటూ వచ్చింది.

శిఖం భూములను ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్నాళ్లు దళితులు ఆధీనంలో ఉన్న భూమిని ఇటీవల రెవెన్యూ అధికారులు వారి నుంచిస్వాధీనం చేసుకున్నారు. కాలేశ్వరం లింకు -2 ప్రాజెక్టు పరిశీలన కోసం సీఎం కేసీఆర్ పర్యటన ఉండగా హెలీపాడ్ నిర్మాణం కోసం ఆర్నేళ్ల క్రితం మెగా కంపెనీ వారు చక చకా చదును చేశారు. అంతకుముందు ముళ్ల కంపలతో నిండి ఉన్న కుంట శికం ప్రదేశాన్ని మెగా కంపెనీ సహకారంతో అధికారులు మట్టి కుప్పలు పోసి వదిలేశారు. సీఎం పర్యటన వాయిదా పడటం వల్ల హెలీ ప్యాడ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కుంట శిఖం భూమిలో తిరిగి సర్కారు తుమ్మలు పెరిగి ఎప్పటిలాగే మారింది.

చిగురించిన ఆశలు

కొత్త ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ తీరుతో ఆశలు చిగురించాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో వెల్గటూర్లో మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తానని బహిరంగంగానే ఆయన ప్రకటించారు. అలాగే మంత్రి ఆదేశాలతో అధికారులు మినీ స్టేడియం నిర్మాణ స్థలాన్ని గుర్తించి సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ ఆధ్వర్యంలో మెగా కంపెనీ వారు పూర్తిగా చదును చేశారు. బేసిక్ గ్రౌండ్ తయారైంది. మినీ స్టేడియానికి స్థలం నిర్ణయం జరిగింది. తాత్కాలిక గ్రౌండ్ గా తీర్చిదిద్దడం క్రీడాభిమణుల్లో ఆనందాన్ని నింపింది. కలిగిస్తుంది.

ఆక్రమణకు అవకాశం

మినీ స్టేడియం నిర్మాణం స్థలం రికార్డుల్లో 7 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సర్వే చేయగా చుట్టుపక్కల వారు సుమారుగా ఒక ఎకరం భూమిని ఆక్రమించినట్టు తేలింది. ఎవరు దాన్ని ఆక్రమించారో తెలుసుకునే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీన్ని ఇలాగే పడావుగా ఉంచితే రాబోవు రోజుల్లో మరింత ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాత్కాలిక కంచె వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిర్మాణ పనులు ప్రారంభించాలి

మినీ స్టేడియం నిర్మాణం కోసం మెగా కంపెనీ సహకారంతో హడావుడిగా పనులు చేయించిన బీఆర్ఎస్ నాయకులు తర్వాత వెనక్కి తగ్గడం క్రీడాభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్టేడియం నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకున్న ఏఎంసీ చైర్మన్ మరింత చొరవ తీసుకొని పనులు ఆగకుండా ముందుకు సాగేలా చూడాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకొని మినీ స్టేడియం నిర్మాణం కోసం నిధులను విడుదల చేసి పనులు ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed