యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపి

by Sridhar Babu |
యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : యూనిక్ కంపెనీ పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ కంపెనీ పేరుతో సుమారు రెండు వందల మందికి కుచ్చుటోపి పెట్టి సుమారు మూడుకోట్ల రూపాయలు కాజేశాడని వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. ఈ మేరకు మహిళలు సునీల్ ఇంటిని శనివారం ఉదయం చుట్టుముట్టి యూనిక్ కంపెనీ పేరుతో తమ వద్ద నెలనెలా వసూలు చేసిన తమ పొదుపు డబ్బు లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సునీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారి‌స్తున్నారు. యూనిక్ కంపెనీ పేరుతో తమ వద్ద సునీల్ నెలనెలా డబ్బులు పొదుపుచేయమన్నాడని, గ్రామ వాసి అని నమ్మితే నట్టేట ముంచాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

46 నెలల తర్వాత యూనిక్ కంపెనీతో డబుల్ ఇప్పిస్తామని చెప్పి 56 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తమ పొదుపు డబ్బులు ఇప్పించడం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న యూనిక్ కంపెనీ బ్రాంచ్ ను సంప్రదిస్తే సునీల్ తో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, ఎవరికి డబ్బులు చెల్లించారో వారినే అడగాలని కంపెనీ వారు అంటున్నారన్నారు. కూలినాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని పొదుపు చేసుకున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొదుపు డబ్బులను సునీల్ తన సొంతానికి వాడుకొని కంపెనీ తో మాట్లాడి ఇప్పిస్తానని బుకాయిస్తూ, నిరుపేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్న సునీల్ నుంచి తమ పొడుపు డబ్బులను ఇప్పించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి ,అగ్రహారం, వెంకటాపూర్, హరిదాస్ నగర్, పధిర తదితర గ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది మహిళలు తమకు న్యాయం చేయాలంటూ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రామాకాంత్ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.



Next Story

Most Viewed