శిథిలావస్థకు చేరిన స్త్రీ శక్తి భవనం.. ఏండ్లుగా కొనసాగుతున్న నిర్మాణ పనులు

by Aamani |
శిథిలావస్థకు చేరిన స్త్రీ శక్తి భవనం.. ఏండ్లుగా కొనసాగుతున్న నిర్మాణ పనులు
X

దిశ, చందుర్తి : మహిళ సంఘాలు ఆత్మ గర్వంగా చెప్పుకోవడానికి ఐకేపీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనం ఏళ్లు గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం తో ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో కాకుల గుట్ట ఆవరణలో 25 లక్షల రూపాయలతో 2012 లో శంకుస్థాపన చేసి మొదలుపెట్టిన ఐకెపి విభాగంలో స్త్రీ శక్తి భవనం నిర్మాణ పనులు పూర్తికాక ముందే శిథిలావస్థకు చేరింది. నాటి నుంచి.. ఇప్పటివరకూ.. ఈ నూతన భవనం నిర్లక్ష్యం నీడలో మరుగున పడింది. చుట్టూ తుప్పలు పేరుకుపోయి భవనం కనిపించకుండా పోతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. చివరికి ఆ భవనానికి వేసిన శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూడా కనిపించకుండా పోయింది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

ఎక్కడో ఒక చోట భవన నిర్మాణం జరుగుతుందని మహిళలు ఒకవైపు సంతోషం వ్యక్తం చేసినా, ఏళ్లు గడుస్తున్నా భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఆ నూతన భవనంలో అడుగుపెట్టక ముందే శిథిలావస్థకు చేరడం కాంట్రాక్టర్ యొక్క పనితనం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. మహిళల కొరకు ఏర్పాటు చేసిన ఈ శ్రీ శక్తి భవనం గ్రామానికి దూరంగా నిర్మించడం, ఆ భవనానికి చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో గతంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. అంతేకాకుండా మందుబాబులకు కూడా అడ్డగా మారిపోయింది. దీంతో భవనానికి అధికారులు తలుపులు, కిటికీలు అమర్చారు. భవనం వినియోగంలో లేకపోవడంతో అవి కూడా ఇప్పుడు చెదలు పట్టి పాడైపోతున్నాయి.

వినియోగంలో లేని భవనానికి కరెంట్ బిల్లు..

పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టిన చందంగా ప్రారంభం కానీ భవనానికి కరెంటు మీటర్ కనెక్షన్ ఇచ్చారు. అయితే ఆ భవనం కరెంటు మీటర్ పెండింగులో బిల్లును చూస్తే అందరూ నూరేళ్లబెట్టి అవాక్కు అవ్వాల్సిందే. ఆ కరెంట్ బిల్లు అక్షరాల రూ.62,300 పైచిలుకు పెండింగ్ లో ఉంది. చాలా ఏండ్ల నుంచి కరెంటు బిల్లు కట్టినట్లు బిల్లు కాగితం చూస్తే తెలుస్తుంది. సరే ఇది సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యమే అయినప్పటికీ, సెస్ అధికారుల బుద్ధి ఎటుపోయిందని పలువురు అంటున్నారు. ఒక సామాన్య మానవుడు తన ఇంటి కరెంట్ బిల్లు రెండు, మూడు నెలలు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్ తీసేస్తామని వారిని హడలెత్తించే ముక్కుపిండి వసూలు చేసే సెస్ అధికారులు ఈ భావన కరెంట్ బిల్లు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించవలసి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. భవన నిర్మాణ పనులతో పాటు మండలం లో మరెన్నో నిర్మాణాలు పెండింగ్ లో ఉండడం పట్ల పలువురు నాయకులు, ప్రజలు అసహనానికి గురవుతున్నారు. నిర్మాణాల విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అధికారుల అండతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారి నిర్లక్ష్యపు సమాధానం..

ఈ విషయంపై సంబంధిత ఏఈ వెంకటేశ్వర్లు వివరణ కోరగా భవనం నిర్మాణానికి సంబంధించిన వివరాల పట్టిక తన వద్ద లేదని జిల్లా కేంద్రంలో ఉన్నదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం గమనార్హం. ఇప్పుడు భవనం వివరాలు తాను చెప్పలేనని, ఆ భవనం ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న క్రమంలో ఆధారాలు దగ్గర లేవని తోచుకొచ్చాడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు అధికారులు వెంటనే స్పందించి శ్రీ శక్తి భవనాన్ని పూర్తి చేసి, పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లును కూడా చెల్లించి అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.Next Story

Most Viewed