TRS లో ముసలం.. చెన్నమనేని, చల్మెడ మధ్య ఆధిపత్య పోరు

by Disha Web Desk 4 |
TRS లో ముసలం.. చెన్నమనేని, చల్మెడ  మధ్య ఆధిపత్య పోరు
X

TRS

దిశ ప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్‌ఎస్ పార్టీలో సరికొత్త ముసలం మొదలైనట్టుగా ఉంది. నిన్న మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న పార్టీలో ఒక్కసారిగా వర్గపోరు భగ్గు మంటోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోనే ఆధిపత్య పోరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. వేములవాడ రాజన్న సాక్షిగా టీఆఎస్‌ సరికొత్త సమస్యనే ఎదుర్కొంటోంది.

ముఖ్య నేతల మధ్యే...

వేములవాడ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు సాగడం లేదు. ముఖ్య నాయకుల నడుమ ఈ వార్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చల్మెడ లక్ష్మీ నరసింహరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్గం కూడా ప్రత్యేకంగా ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో లక్ష్మీనరసింహరావు తన స్వగ్రామమైన వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మల్కపేట స్కూల్ ను రూ. కోటి వరకూ వెచ్చించి బాగు చేయించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునందుకున్న లక్ష్మీ నరసింహరావు తన స్వగ్రామంలోని పాఠశాలను సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. పాఠశాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రిని కూడా చల్మెడ ఆహ్వానించారు. సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమం అర్థాంతరంగా రద్దయింది. మొదట మంత్రులు మల్కపేటకు వచ్చేందుకు సమ్మతించినప్పటికీ అనూహ్యంగా వారి టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మంత్రుల పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే రద్దు చేసుకున్నారని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. రానున్న ఎన్నికల్లో వేములవాడ నుండి ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ మొదలు పెట్టిందన్న ప్రచారం నేపథ్యంలో చల్మెడ టీఆర్‌ఎస్‌లో చేరి అక్కడ పావులు కదపడం ఆరంభించారు. దీంతో చెన్నమనేని రమేష్ బాబు రంగంలోకి దిగి చల్మెడ వర్గం కార్యకలాపాలను నియంత్రించే పనిలో పడ్డారని తెలుస్తోంది.

అప్పుడలా...

గతంలో కూడా వేములవాడ నియోజకవర్గం టికెట్ విషయంలో పోటీ తప్పలేదు. జడ్పీ ఛైర్ పర్సన్ గా పని చేసిన తుల ఉమ ఇక్కడి నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరకు తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని నిర్దారించుకున్న తరువాతే తుల ఉమ బీజేపీ వైపు అడుగులు వేశారని తెలుస్తోంది. తాజాగా మరోసారి చెన్నమనేనికి చల్మెడ రూపంలో పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనన్న ఆసక్తి రేకెత్తుతోంది.

ప్లీనరీ వేళ...

రెండు రోజుల్లో పార్టీ ఆవిర్బావ దినోత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలోనే వేములవాడలో వర్గపోరు వెలుగులోకి రావడం పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీలో అంతర్గత విబేధాలు వెలుగులోకి వస్తుండడం ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే తిరుగుబావుటా ఎగురేసిన నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మెప్పించి పోటీ నుండి తప్పించడంలో మంత్రి కేటీఆర్ సఫలం అయ్యారు. ఈ సమయంలో వారితో ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమై వేములవాడ పరిస్థితులపై చర్చించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుపై ఉన్న వ్యతిరేత అంతా కూడా అప్పుడు స్థానిక నాయకులు కేటీఆర్ కు వివరించారు. తాజాగా మరోసారి చెన్నమనేని తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు పావులు కదపుతుండడంతో వేములవాడ గులాభిలో గ్రూపులు మొదలయ్యాయని వెలుగులోకి వచ్చింది. పార్టీ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందోనన్న విషయంపైనే ఇక్కడి క్యాడర్ లో ప్రధాన చర్చగా సాగుతోంది.


Next Story