MLC Jeevan Reddy: శ్రమ దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

by Shiva Kumar |
MLC Jeevan Reddy: శ్రమ దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
X

సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దిశ, సారంగాపూర్ : కార్మిక చట్టం ప్రకారం పనికి తగిన వేతనాలు చెల్లించాలి. కానీ, అలా చెల్లించకుండా దేశంలో శ్రమ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష చేపట్టిన గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన వర్కర్ల శిబిరాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో నలుగురితో పని చేయిస్తూ ఇద్దరి వేతనాలు చెల్లించడం అనేది దళితుల శ్రమ దోపిడీయేనని అన్నారు.

ఇదే విషయమై త్వరలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు లేఖ రాస్తానని తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు రావడానికి కారణమైన పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లింపులో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎద్దేవా చేశారు. దళిత సమాజం వివక్షకు గురికావొద్దని, దళితులకు రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రత్యేకంగా హక్కులు కల్పిస్తే దళితులపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. దళితుల శ్రమ దోపిడీ చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

పంచాయతీ కార్మికులకు రూ.15 వేల వేతనం చెల్లించాలని, ఎవరైనా కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు డప్పు కొడతారని హెచ్చరించారు. పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్మికులకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి హక్కులను కాపాడుతూ.. వారికి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ రవి, కొండ్రా రామచంద్రా రెడ్డి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed