సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు

by Disha Web Desk 15 |
సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న 34 రాష్ట్ర సహకార సంఘాల ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రుణాల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అధికారి కన్వీనర్ గా 11 మంది సభ్యులతో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 106 మత్స్యకార సహకార సంఘాలు, 31 డెయిరీ సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 10 రిటైల్ పెట్రోల్ పంపులు ఉన్నాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కిసాన్ సమృద్ధి కేంద్రాలు, కామన్ సర్వీస్ కేంద్రాలను మన

జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ధాన్యం నిల్వల కేంద్రం నిర్మాణ ప్రణాళిక దిశగా గంభీరావుపేట్ లో రైస్ మిల్ కం గోడౌన్ నిర్మించామని, జాతీయస్థాయిలో ఉన్న సీడ్స్ సోసైటీ లో సహకార సంఘంలో ఉన్న రైతులు రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. జిల్లాలో ఉన్న 106 మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి జిల్లా ఫెడరేషన్ ఏర్పాటు చేశామని, మత్స్య సహకార సంఘాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా డెయిరీ సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలకు జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ లకు అవసరమైన లింకేజ్ ఏర్పాటు చేయాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల,

మత్స్య సహకార సంఘాలు, డెయిరీ సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేసి వాటి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అవసరమైన వసతులు కల్పించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి భుద్ద నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ , జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. కొమురయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గీతా, నాబార్డ్ డీడీఎం జయ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed