- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంథనిలో శ్రీధర్ బాబు రాజ్యాంగం నడుస్తోంది : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథనిలో ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాజ్యాంగం నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

దిశ, గోదావరిఖని : మంథనిలో ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాజ్యాంగం నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నేత అరెస్టుపై రామగుండం కమిషనర్ ను కలిసేందుకు గోదావరి ఖనికి వచ్చిన ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ కమిషనరేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేస్తూ.. నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో రాజకీయ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
ముత్తారం మండలానికి చెందిన బండ రాజు ఆత్మహత్య ఘటనలో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా, బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరించడం సరికాదని, ఈ విషయంలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని పుట్ట మధుకర్ విమర్శించారు. ఈ వ్యవహారంపై పోలీస్ కమిషనర్‌కు పూర్తి వివరాలు అందజేసి న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలను బీఆర్ఎస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు.






