సీహెచ్‌సీలో వెక్కిరిస్తున్న వైద్యుల కొరత

by Sumithra |
సీహెచ్‌సీలో వెక్కిరిస్తున్న వైద్యుల కొరత
X

ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. పెరిగిన జనాభా నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (30 పడకల ఆసుపత్రి)గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేక రోగులకు మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. 11 మంది డాక్టర్లకు కేవలం నలుగురు వైద్యాధికారులు మాత్రమే డిప్యూటేషన్ పై ఇక్కడ పని చేస్తున్నారు. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తే ఈ మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎత్తివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లారెడ్డిపేటలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి పేట, వీర్ణపల్లి రెండు మండలాలకు చెందిన వందలాది మందికి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఈ కేంద్రం సీహెచ్సీగా అప్ గ్రేడ్ కావడంతో పీహెచ్సీని ఎత్తివేయనున్నట్లు తెలిసింది.

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎత్తివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి సర్పంచ్ వడ్నాల నర్సయ్య అధ్యక్షతన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం కీలక నిర్ణయం తీసుకుని గ్రామంలో గల ప్రజలకు ఒక్కో రేషన్ కార్డుదారుడికి పది రూపాయల చొప్పున వసూలు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ వైద్యశాలను అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి పేట, వీర్ణపల్లి రెండు మండలాలకు చెందిన వందలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ జనాభా పెరగడంతో ఎల్లారెడ్డిపేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (30 పడకల ఆసుపత్రి)గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బొప్పపూర్ లో గల హెల్త్ సబ్ సెంటర్ కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అందిస్తున్నారు.

ఎనిమిది హెల్త్ సబ్ సెంటర్లు..

ఎల్లారెడ్డిపేట పీహెచ్సీకి అనుబంధంగా ఎల్లారెడ్డి పేట, కిషన్ దాస్ పేట, బండలింగంపల్లి, నారాయణ పూర్, తిమ్మాపూర్, బొప్పాపూర్, వెంకటాపూర్, రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ వీటిలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలకు జ్వరం వచ్చినా.. ఇతరత్రా జబ్బుల బారిన పడిన వారికి అంతే కాకుండా ఇక్కడ గర్భిణులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా బొప్ప పూర్ లో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వీర్ణపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలీనం చేయనున్నారు.

ఆమడ దూరంలో ఎందుకు?

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేటలో సిరిసిల్ల - కామారెడ్డి బొప్పాపూర్, బండలింగంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్నప్పటికీ... ఈ కేంద్రాన్ని సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలీనం చేయడంలో ఆంతర్యం ఏమిటో ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి సైతం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

మూడే గ్రామాలు అనుబంధం

వీర్ణపల్లి మండల కేంద్రంలో గల హెల్త్ సబ్ సెంటర్ కు అనుబంధంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ , వీర్ణపల్లి, ఇదే మండలం గర్జనపల్లి గ్రామాల మూడు అనుబంధ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండగా ఎనిమిది సెంటర్లు కలిగిన ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వీర్ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలీనం చేయడం ఏంటనేది మండలంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కంటింజెంట్ వర్కర్ల ఇబ్బందులు ఇవి..

ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బోప్పపూర్ హెల్త్ సబ్ సెంటర్ కు ఎల్లారెడ్డిపేట చుట్టుపక్కల గల కంటింజెంట్ వర్కర్లు బొప్ప పూర్ లో గల హెల్త్ సబ్ సెంటర్లో అటెండెన్స్ ఇవ్వాల్సి ఉండగా బండలింగంపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం జరుగకపోవడంతో దీని నిర్వహణ స్థానంలో వీర్ణపల్లిలో ఇట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విలీనం కావడం వల్ల ప్రతిరోజూ 18 కిలోమీటర్ల దూరం వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది హెల్త్ సబ్ సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, హెల్త్ సూపర్ వైజర్ లు స్టాఫ్ నర్స్ లతో నెల వారి సమావేశం నిర్వహించినప్పుడల్లా వీర్ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరం వెళ్ళి సమావేశానికి హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొననుంది. కనీసం రాను పోను కూడా వసతులు సరిగా లేక హెల్త్ సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రలు తీసుకోవడానికి 18 కిలోమిటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది కి సంబంధించిన అటెండెన్స్ రిజిష్టర్ ను కూడా వీర్ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్నేహకు అప్పగించాలని ఆరోగ్య కేంద్రం యూడీసీ బొప్పపూర్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సారియ అంజుమ్ ను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. బొప్పపూర్ లో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వీర్ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విలీనం చేయకుండా ఎల్లారెడ్డి పేట మండలంలో ఉండేలా చూడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను, నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని మండల ప్రజలు కోరుతున్నారు.

డాక్టర్లంతా డిప్యుటేషన్ పైనే

ఎల్లారెడ్దిపేట లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నలుగురు డాక్టర్లు, జనరల్ మెడిసిన్ వైద్యులు పిల్లల వైద్యులు ఓంకార్, ఎంబీబీఎస్ వైద్యులు ప్రదీప్, రఘులు జిల్లా ఏరియా హాస్పిటల్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ ప్రదీప్ గౌడ్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మొత్తం 11 మంది వైద్యులు పూర్తి స్థాయిలో వైద్యులు ఉండాల్సి ఉండగా పూర్తి స్థాయి వైద్యులు ఒక్కరు కూడా లేరని.. కేవలం ఫుల్ స్టాఫ్ గా 14 మంది నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారన్నారు. ఇందులో నలుగురిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటేషన్ పై పంపించడం జరిగింది. ఒకరు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేదు. ముఖ్యమంత్రి పెషీ లో ఫైల్ పెండింగ్ లో ఉంది. ఫైల్ కు ఆమోదం లభించడమే ఆలస్యంగా ఉందని ప్రదీప్ గౌడ్ తెలిపారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వినియోగించుకోవాలి.. రజిత, జిల్లా వైద్యాధికారిణి

ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ సేవలు మండల ప్రజలు వినియోగించుకోవాలి. ఆయా గ్రామాల్లో గల హెల్త్ సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయి. బండలింగంపల్లిలో సాధ్యమైనంత త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.

Advertisement
Next Story