రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

by Nallavelli.Anjaneyulu |

మండల కేంద్రాల్లోని రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలని, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిబంధనల ప్రకారం.. పారదర్శకంగా పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా
X

దిశ, గంగాధర/చొప్పదండి : మండల కేంద్రాల్లోని రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలని, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిబంధనల ప్రకారం.. పారదర్శకంగా పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె చొప్పదండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదా బైనామా రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా గంగాధర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సాదా బైనామా (భూముల క్రమబద్ధీకరణ)కు సంబంధించి ఇప్పటివరకు అందిన దరఖాస్తులు ఎంత? వాటిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయినవి ఎన్ని? ఇంకా పెండింగ్‌లో ఉన్న దస్త్రాల వివరాలు ఏంటి? అనే అంశాలపై కలెక్టర్ చిత్రా మిశ్రా రిజిస్టర్లను స్వయంగా తనిఖీ చేస్తూ అధికారులను ఆరా తీశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దస్త్రాలను సిద్ధం చేసి తదుపరి చర్యల కోసం నివేదించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి హితవు పలికారు. ఈ తనిఖీ కార్యక్రమాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చొప్పదండి, గంగాధర మండలాల తహసీల్దార్లు నవీన్ కుమార్, అంబటి రజిత, డిప్యూటీ తహసీల్దార్లు , రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, తహసీల్దార్ కార్యాలయాల సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story