విధులకు రాకున్నా సూపర్వైజర్‌కు వేతనం

by Aamani |
విధులకు రాకున్నా  సూపర్వైజర్‌కు వేతనం
X

దిశ, మంథని : మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఓ సూపర్వైజర్ విధులకు హాజరు కాకున్నా వేతనం చెల్లించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కొంతమంది సూపర్వైజర్లు ఈనెల 15న సీడీపీవో పద్మ శ్రీ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశం మేరకు డీడబ్ల్యువో రవుఫ్ ఖాన్‌ గురువారం మంథని ఐసీడీఎస్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. స్వరూప అనే సూపర్వైజర్ అనారోగ్యంతో విధులకు రాకున్నా 2023 ఏప్రిల్, మే నెలల వేతనం చెల్లించినట్లు సూపర్వైజర్లు ఫిర్యాదు చేయగా డీడబ్ల్యూఓ రవూఫ్ ఖాన్ రికార్డులు పరిశీలించారు.

సూపర్వైజర్ విధులకు రాకున్నా వేతనం చెల్లించినట్లు తేలిందని డీ డబ్ల్యూ వో రవూఫ్ ఖాన్ తెలిపారు. మరోవైపు సూపర్వైజర్ల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదులు స్వీకరించారు. విధులకు రాని సూపర్వైజర్ కు వేతనం చెల్లింపు తో పాటు మరికొన్ని అంశాలను కూడా సూపర్వైజర్లు తమ ఫిర్యాదులు పేర్కొన్నట్లు తెలిసింది. విచారణ నివేదికను కలెక్టర్ కు సమర్పించనున్నట్లు రవూఫ్ ఖాన్ తెలిపారు. ఆయన వెంట సూపరిండెంట్ కె.రాజయ్య ఉన్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story