తిరుగబడ్డ లారీ ఓనర్లు.. ఓ వర్‌లోడ్‌తో వెళ్తూ వారిపై ఫైర్(వీడియో)

by Dishanational2 |
తిరుగబడ్డ లారీ ఓనర్లు.. ఓ వర్‌లోడ్‌తో వెళ్తూ వారిపై ఫైర్(వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జమ్మికుంట సమీపంలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీలను నిలువరిస్తున్న ప్రైవేటు ఉద్యోగిపై లారీ ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్ల ఫోన్లు ఎందుకు లాక్కున్నావంటూ మండిపడ్డారు. అయితే అక్కడ మాత్రం రోడ్డు ట్రాన్స్ పోర్టు విభాగానికి చెందిన అధికారులు ఎవరూ లేకపోవడం విడ్డూరం. ప్రైవేటు ఉద్యోగి ఫోన్ చేసిన తరువాత ఆర్టీఏ అధికారులు అక్కడకు చేరుకోవడం గమనార్హం. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఆర్టీఏ విభాగం పనితీరును శంకిస్తోంది. ఓవర్ లోడ్‌తో వెళ్తోన్న లారీలను మామూళ్లు ఇస్తే పంపిస్తున్నారని, నెలకు ఇంత, లారీకి ఇంత అని వసూలు చేస్తున్నారని ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. అయితే ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకుని జరిమానాలు విధించినట్టయితే సర్కారుకు ఆదాయం రానుంది. కానీ ఇక్కడ ఆర్టీఏ అధికారులు మాత్రం మామూళ్లు వసూలు చేస్తూ వదిలిపెడ్తున్నారన్న విమర్శలు వస్తుండడంపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

ఓవర్ లోడ్‌ను నియంత్రించడం వల్ల సర్కారుకు రెండు విధాల లాభం చేకూరుతుందని అధికారులు అంటున్నారు. లారీల సామర్థ్యానికి తగ్గట్టుగా లారీలను అనుమతించడం వల్ల రహదారులు ధ్వంసం కాకుండా ఉంటాయని అలాగే అదనంగా తీసుకెల్తున్న ఇసుక ద్వారా కూడా సర్కారుకు రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున సర్కారు మరింత రెవెన్యూను సాధించనుంది. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల నుండి అక్రమంగా తరలిపోతున్న ఇసుక ద్వారా రోజూ రూ.కోట్లలో ఆదాయం టీఎస్ఎండీసీకి చేరనుందని సమాచారం.

వైరల్ వీడియోతో ఏం చేస్తారో..?

సాక్షాత్తు ఆర్టీఏ అధికారుల కనుసన్నల్లోనే ఓవర్ లోడ్ లారీల నుండి అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతున్నదని నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ఈ వీడియో ఆధారంగా ఆర్టీఏ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న చర్చ సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న దందాకు సపోర్ట్ చేస్తున్న అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటే తప్ప అక్రమ రవాణాకు తెరపడే అవకాశాలు లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed