ప్రాణాలు పోయినా పట్టించుకోరా?

by Dishafeatures2 |
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?
X

దిశ, మంథని, ముత్తారం: అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. నిర్మాణం చేపడుతున్న చెక్ డ్యామ్ లో మృతి చెందిన ఓ తల్లి కొడుకుల పరిస్థితి మరెవరికి రాకూడదని స్థానికులు అలర్ట్ అయ్యారు. సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని సోమవారం స్థానికులు 100 నెంబర్ కు డయల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి మానేరులో నిర్మాణం చేపడుతున్న చెక్ డ్యామ్ వద్ద ప్రమాదాలు జరగకుండా ఎలాంటి సూచిక బోర్డులు పెట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మానేరులో నిర్మాణం చేపడుతున్న చెక్ డ్యామ్ సమీపంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండడం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లే వంతెన సమీపంలో ఉండడంతో నిత్యం జనాభా రాకపోకలు ఉంటాయి. ముత్తారం మండలం ఖమ్మం పల్లికి చెందిన బగ్గని సుమలత ఆమె కుమారుడు మనోజ్ తో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లారు. దాహం తీర్చుకొనుటకు వెళ్లిన తల్లి కొడుకులు చెక్ డ్యామ్ లో పడి జూన్ 4 2021న మృతి చెందారు. చెక్ డ్యామ్ నిర్మాణం వద్ద ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతోనే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తల్లి కొడుకులు మృతి చెందారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే.

100కు ఫోన్ చేస్తే.. ఇరిగేషన్ అధికారులకు చెప్పుతామన్నారు..!

ఆ తల్లి కొడుకుల్లాగా చెక్ డ్యామ్ లో పడి ఎవరు మృతిచెందకూడదని స్థానికులు అలర్టై 100 కు ఫోన్ చేశారు. 100 నెంబర్ పోలీస్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఇది మా పరిధి కాదని ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇస్తామని తెలిపారని స్థానికులు చెప్పారు. మానేరులో నిర్మాణం చేపడుతున్న చెక్ డ్యాం సమీపం నుంచి వ్యవసాయ పనులకు వెళ్లే రైతులతో పాటు ప్రయాణికులు నడుస్తూ ఉంటారు. అధికారులు ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు పెట్టకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ చెక్ డ్యామ్ లో పడి చనిపోయిన కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం అందించలేదని, అలాంటి పరిస్థితితో కుటుంబాలు నష్టపోవద్దని ముందస్తుగా హెచ్చరిక బోర్డులు పెట్టాలని సంబంధిత అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 నెంబర్ కు ఫోన్ చేస్తే పరిష్కారం లభిస్తుంది అనుకున్నా స్థానికులకు నిరాశే కలిగింది.


Next Story

Most Viewed