కదులుతున్న బీఆర్ఎస్ పీఠాలు

by Disha Web Desk 23 |
కదులుతున్న బీఆర్ఎస్ పీఠాలు
X

దిశ, మంథని : మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయి. స్థానిక పాలన పగ్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను బలహీనం చేసేందుకు వ్యూహరచన చేసి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తొలుత మంథని మున్సిపాలిటీపై గురిపెట్టి బీఆర్ఎస్ కు చెందిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టించి వారిని పదవుల నుంచి దించారు. 2021 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 13 వార్డులకు గాను 9మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచారు.

కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారి మంథనిలో గెలిచిన శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మంథని మున్సిపల్ లోని ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. వెనువెంటనే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై ఈనెల 1న అదనపు కలెక్టర్ కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఈనెల 16న జరిగిన ప్రత్యేక సమావేశంలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం నెగ్గగా మున్సిపల్ మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ చేతికి చిక్కింది . ఇదిలా ఉంటే ముత్తారం సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ లను కుర్చీ నుంచి దించేందుకు కాంగ్రెస్ పావులు కదిపి సఫలీకృతమైంది. ఇక్కడ బీఆర్ఎస్ కు చెందిన డైరెక్టర్లు కాంగ్రెస్ లో చేరగా మెజారిటీ డైరెక్టర్లంతా కలిసి అవిశ్వాసం పెట్టారు. శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఇంతకాలం బీఆర్ఎస్ చేతిలో ఉన్న పాలన పగ్గాలు కాంగ్రెస్ చేతికి చిక్కనున్నాయి. ఇదేగాక

నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రం గారెపల్లి సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ దబ్బెట స్వామి లపై మెజార్టీ డైరెక్టర్లు ఈనెల 15 అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. మార్చి 11న ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు ఉండగా బీఆర్ఎస్ డైరెక్టర్లు ఆరుగురు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన చల్ల నారాయణరెడ్డి గారెపల్లి( కాటారం)సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసే నారాయణరెడ్డి 2017 లో బీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి టికెట్ దక్కక పోవడంతో తర్వాత బీఎస్పీలో చేరి బరిలో నిలిచారు. కేవలం 3000 ఓట్ల లోపు సాధించి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. కాగా నారాయణరెడ్డిని సింగిల్ విండో చైర్మన్ పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ డైరెక్టర్లతో అవిశ్వాసం పెట్టించింది. నారాయణరెడ్డి ని పదవి నుంచి దింపాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ చేతిలో మెజారిటీ సింగిల్ విండోలు

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహాదేవపూర్, కమాన్పూర్ సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ముత్తారం సింగిల్ విండో ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో నియోజకవర్గంలో మెజారిటీ సింగిల్ విండోలు కాంగ్రెస్ చేతికి చిక్కి నట్లయింది


Next Story

Most Viewed