రేకుర్తి ఇండ్ల కూల్చివేతలో మంత్రి గంగుల, ఎంపీ బండి సంజయ్ హస్తం..

by Disha Web Desk 20 |
రేకుర్తి ఇండ్ల కూల్చివేతలో మంత్రి గంగుల, ఎంపీ బండి సంజయ్ హస్తం..
X

దిశ, కరీంనగర్ టౌన్ : బీఆర్ఎస్ పార్టీ గుండాలు ప్రైవేట్ స్థలంలో నిర్మించుకున్న పేదల ఇండ్లను అక్రమంగా బుల్డోజర్లతో కూల్చివేయడం వెనుక మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ హస్తం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో పేదల ఇండ్లను అక్రమంగా కూల్చిన ప్రదేశాన్ని ఆయన నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వేనంబర్ 194లో పేదల ఇళ్ల స్థలాల కోసం కుల, మతాలకు ఆతీతంగా షేక్ ఖాన్ వారసులు నిరుపేదలైన ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 20 ఏళ్ల క్రితమే ఇండ్లస్థలాలు దానం చేశారని గుర్తు చేశారు.

గ్రామపంచాయతీ ద్వారా అన్ని రకాల అనుమతులు పొంది ఇళ్లను నిర్మించుకొని, ఇంటిపన్నులు చెల్లిస్తున్న పేదల పై కక్ష సాధింపుతోనే అక్రమంగా, దౌర్జన్యంతో కట్టిన ఇండ్లను కూల్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పేదల ఇళ్లస్థలాలను బలవంతంగా గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టడం కోసమే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేశారని ఆరోపించారు. కమలాకర్, బండి సంజయ్ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనని, వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. కేసీఆర్ నియంతపాలనలో తెలంగాణలోనూ యోగీలున్నారన్నారన్న విషయం ప్రజలకు తెలుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మాఫియా వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. రేకుర్తిలో వందలకోట్లు విలువ చేసే భూమిని ఆక్రమణకు కుట్రపన్ని ముఖ్యమంత్రి రియల్ మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

అన్నికులాలు, మతాల వారున్నా కేవలం పేద ముస్లింల ఇండ్లను టార్గెట్ చేసి కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే కూల్చిన ఇండ్ల స్థలాల్లో విద్యుత్, రోడ్లు, త్రాగునీటి వసతి కల్పించి, ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకు బాధితుల పక్షాన బీఎస్పీ పోరాడుతుందన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియాను పోషిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ బుల్డోజర్ పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచందర్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, నాయకులు మంద రవీందర్, దాసరి ఉషతదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: కవితను కాపాడేందుకు బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: RSP


Next Story

Most Viewed