వెండికి బంగారం పూత పూసి అమ్ముదామనుకున్నారు... కానీ,....

by S Gopi |

ఇత్తడికి పుత్తడి పూసి మోసం చేసే బ్యాచ్ వ్యవహారాన్ని కరీంనగర్ పోలీసులు కట్టడి చేశారు. గుట్టుగా దందా... Latest News

వెండికి బంగారం పూత పూసి అమ్ముదామనుకున్నారు... కానీ,....
X

దిశ, కరీంనగర్: ఇత్తడికి పుత్తడి పూసి మోసం చేసే బ్యాచ్ వ్యవహారాన్ని కరీంనగర్ పోలీసులు కట్టడి చేశారు. గుట్టుగా దందా చేసి వ్యాపారం చేయాలనుకున్న ముఠా గుట్టును రట్టు చేసి ఆదిలోనే అడ్డుకున్నారు. పోలీసులు దూకుడుగా వ్యవహరించినట్టయితే ఈ ముఠా చేతిలో మోసపోయే బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగేది. కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస రావు కథనం ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లికి చెందిన నక్క రాజయ్య (46), మల్లారం గ్రామానికి చెందిన కొమ్ము తిరుపతి(45), నూకలమర్రికి చెందిన సోమినేని భాస్కర్ (42)లు కలిసి ముఠాగా ఏర్పడి వెండి బిల్లలకు బంగారు పూత పూయించి విక్రయించేందుకు పూనుకున్నారు.

పట్నం వెండి.. కరీంనగర్ గోల్గ్...

వీరంతా కలిసి హైదరాబాద్ లో కొన్ని వెండి బిల్లలు కొనుగోలు చేసి వాటికి బంగారం పూత పూయించాలని భావించారు. ఈ మేరకు వెండి బిల్లలను కొనుగోలు చేసుకుని కరీంనగర్ లోని తిలక్ నగర్ లో ఓ వృత్తి పనిచేసుకుని జీవనం సాగించే వ్యక్తి వద్దకు వెళ్లారు. వివాహంలో గిఫ్టులు ఇవ్వాలని వెండి బిల్లలకు బంగారం పూత వేయించుకున్నారు. వీటిని బంగారం బిల్లలని సామాన్యులను నమ్మించి విక్రయించాలని వ్యూహం పన్నారు. ఈ మేరకు తమ తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యామని వాటిని గుట్టుగా విక్రయించడమే తరువాయి అనుకున్నారు నిందితులు. అనూహ్యంగా గురువారం కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కీలక సమాచారం అందుకుని నిందితుల కోసం వేట ప్రారంభించి మంచిర్యాల చౌరస్తాలో అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల వద్ద రూ. లక్ష విలువ చేసే బంగారం పూత పూయించిన 40 వెండి కాయిన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ త్రీ టౌన్ సీఐ పి దామోదర్ రెడ్డి, ఎస్ఐ పి శ్రీనివాస్ రావు, ఏఎస్ఔ బషీరుద్దీన్, పీసీలు రాజ్ కిరణ్, కృష్ఱాల బృందం నకిలీ బంగారం కాయిన్స్ విక్రయించేందుకు సిద్దమైన ముఠాను పట్టుకున్నారని ఏసీపీ వివరించారు.

అప్రమత్తత అవసరం: ఏసీపీ తుల శ్రీనివాస రావు

కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే నిందితులు ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని, ఇలాంటి వారిపట్టల జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు సూచించారు. నిందితులు మోసాలకు పాల్పడకముందే వారిని కట్టడి చేశామన్నారు. ఇలాంటి వారిని నమ్మకుండా లైసెన్స్ వ్యాపార సంస్థల్లో మాత్రమే బంగారు ఆభరణాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయాలన్నారు. తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడి ఇలాంటి వారి వద్ద కొనుగోలు చేసి నష్టపోవద్దన్నారు.

Next Story