బిగ్ బ్రేకింగ్.. ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు

RS Praveen Kumar

దిశ ప్రతినిధి, కరీంనగర్: గురుకులాల మాజీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీ టౌన్‌లో కేసు నమోదైంది. అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ కొన్ని వర్గాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు క్రై నెంబర్ 144/2021లో 153-A, 295-A, 298 r/w 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

ఈ ఏడాది మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం ధూళికట్ట గ్రామంలో ‘స్వేరో’స్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా.. స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు ఓ ప్రతిజ్ఞ చేయించారు.

‘హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, శ్రాద్ధ కర్మలు పాటించమని, పిండదానాలు చేయబోమంటూ.. హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞలో స్వేరోస్ సభ్యులతో పాటు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆర్.ఎస్ ప్రవీణ్‌ కుమార్‌పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

న్యాయవాది కంప్లైట్‌తో..

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి.. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేశారంటూ కరీంనగర్ త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో మార్చి 16న ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కరీంనగర్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి, మరో న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ సహాయంతో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును జూలై 21న విచారించిన న్యాయమూర్తి సాయిసుధ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా త్రీ టౌన్‌ పోలీసులను ఆదేశించారు. ఈ ఆదేశాలతోనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ఏవిధంగా స్పందిస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ప్రవీణ్ కుమార్  కొత్త పార్టీపై RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన