బీఆర్ఎస్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందడం సరైందేనని.. తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు సహజంగా జరిగే ప్రక్రియేనని వ్యాఖ్యానించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు బలంగా ఉంటేనే దావోస్ లాంటి వేదికలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకు తగ్గట్టుగా విధి విధానాలు ఉన్నట్టయితే పెట్టుబడులు వస్తాయని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆరంభంలో చూపించిన ఉత్సాహాన్ని ఇప్పుడు చూపించలేకపోతోందన్నారు.

ఎన్నికల తేదీలు సమీపిస్తేనే రాజకీయ పార్టీల పొత్తులపై స్పష్టమైన అవగాహన వస్తుందని, అప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదన్నదే తన అభిప్రాయమని.. చీలకుండా ఉండడమన్నది అవసరం కూడా అని వ్యాఖ్యానించిన పవన్.. అలాగని అందరూ కలిసి రావాలని కూడా లేదన్నారు. బీజేపీతో అలయెన్స్‌లో ఉన్నందున ఆ పార్టీతో కలిసి వెళ్తానని లేదంటే ఒంటరిగా వెళ్తానని, కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతానని స్పష్టం చేశారు.

ఏపీ సర్కార్‌పై ఫైర్..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ వైఫల్యాలను మరో సారి ఎత్తిచూపారు. ఓ వైపు దావోస్ పెట్టుబడుల విషయంలో ఏపీ విఫలం అయిందన్న పవన్ కళ్యాణ్.. జీఓ నెంబర్ 1 విడుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరూ తిరగకూడదనే ఉద్దేశ్యంతో జారీ చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉన్నట్టయితే వైసీపీ ప్రభుత్వం ఈ జీఓ విడుదల చేయాల్సిన అవసరమే లేదని, ఆ పార్టీ నాయకులకు కూడా నమ్మకం సన్నగిల్లుతోందని అభిప్రాయపడ్డారు.

జనాభాకు తగ్గట్టుగా నేతలు..

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగానే నాయకులు కూడా పుట్టుకోస్తారని వ్యాఖ్యానించిన పవన్.. వైరుద్య భావాలతో పుట్టుకొచ్చే విరుద్ద భావాలు గల నాయకుల అవసరం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. పునర్జన్మనిచ్చిన నేలతల్లి తెలంగాణ అని, ఈ తెలంగాణ తల్లికి పాదాభివందనాలు చేసుకుంటున్నానన్నారు. భవిష్యత్తులో జనసేన తెలంగాణలోనూ పని చేస్తుందని, తెలంగాణ కళాకారులకు వందనాలు చేస్తున్నానన్నారు. దేశం కోసం, రెండు తెలుగు రాష్ట్రాల కోసం పనిచేస్తానని, తన ప్రచార రథానికి కూడా తల్లి వారాహి పేరు అందుకే పెట్టామన్నారు. మూడు రోజులుగా కొండగట్టు పర్యటన కోసం పనిచేసిన తెలంగాణ జనసేన, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్ జైతెలంగాణ, జై హింద్ అంటూ వారాహీ వాహనంపై నుండి తన ప్రసంగాన్ని ముగించారు.



Next Story

Most Viewed