స్టేటస్ సింబల్‌గా 'వెపన్'.. భయానికా.. భయపెట్టడానికా..?

by Disha Web Desk 19 |
స్టేటస్ సింబల్‌గా వెపన్.. భయానికా.. భయపెట్టడానికా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అధికారం, హంగు ఆర్భాటం ఉన్నా ఆ ఒక్కటి ఉంటే అన్ని సాధించినట్టే అనుకుంటున్నారు కొందరు. వారికి అనుకూలంగా పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు నేతలు. దీంతో పోలీసు అధికారులు అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి తయారైంది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన ఈ స్టేటస్ సింబల్ కోసం ఉవ్విళ్లూరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయినట్టుగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయుధ లైసెన్స్ తీసుకోవాలని ఉత్సుకత చూపుతున్న వారికి అనుకూలంగా నాయకులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వైరుధ్యాలు.. టార్గెట్..

సాధారణంగా వైరుధ్యం ఎక్కువగా ఉండి ప్రత్యర్థుల నుండి ప్రాణ హాని ఉండడం, విప్లవ పార్టీలు, టెర్రర్ సంస్థల టార్గెట్ కావడం వంటి వారికి ఆయుధ లైసెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఐటీ చెల్లించి తమ వాహనాల్లో రూ. కోట్లు తీసుకెల్లే వారి రక్షణగా గన్ లైసెన్స్ ఇస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ కోవలోకి చెందని వారికి కూడా ఆయుధ లైసెన్స్ ఇవ్వాలన్న ఒత్తిళ్లు పోలీసు అధికారులపై తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, మండల స్థాయికి ఎదిగిన నాయకులు కూడా తమకు వెపన్ లైసెన్స్ ఇప్పించాలన్న ప్రతిపాదనలు తమ నాయకుల ముందు ఉంచుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వారి కోరిక మేరకు ముఖ్య నాయకులు కూడా పోలీసు అధికారులకు చెప్తున్నారు. అయితే లెసెన్స్ తీసుకుని వినియోగిస్తున్నప్పటికీ గన్ కల్చర్ పెరగడం అనేది సరికాదన్న వాదలను వినిపిస్తున్నాయి. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన గొడవలో క్రిమినల్ కేసు నమోదైందన్న కారణంగా ఓ బీజేపీ నాయకుని గన్ లైసెన్స్ ను అక్కడి కలెక్టర్ రద్దు చేశారు.

అయితే టార్గెట్ అయ్యామన్న విషయాన్ని తెరపైకి తీసుకువచ్చే పరిస్థితులు కూడా ఉమ్మడి జిల్లాలో లేవనే చెప్పాలి. గతంలో పశ్చిమ డివిజన్‌లో జనశక్తి, తూర్పులో పీపుల్స్ వార్ (మావోయిస్టు)లతో పాటు వివిధ విప్లవ సంస్థల ఉనికి తీవ్రంగా ఉండేది. ఈ క్రమంలో ఆయా విప్లవ సంస్థలు టార్టెట్ అయిన వారికి వెపన్ లైసెన్స్ ఇచ్చే సంస్కృతి ఉండేది. అయితే విప్లవ సంస్థల ఉనికి పూర్తిగా తెరమరుగైపోయిన ఈ పరిస్థితుల్లో ఎదో రకంగా లైఫ్ థ్రెట్ ఉందన్న బూచిని చూపించి ఆయుధ లైసెన్స్ తీసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు అధికార పార్టీకి చెందిన చట్టసభ ప్రతినిధి పోలీసు అధికారుల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం సదరు స్థానిక ప్రజా ప్రతినిధులే బాహాటంగా చెప్పుకుంటుండడం విశేషం. ఒకరిద్దరు రియాల్టర్లు కూడా పొలిటికల్ లీడర్లను ఆశ్రయించి తమకు ఆయుధా లైసెన్స్ ఇప్పించాలని వేడుకుంటున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ..

విప్లవ పార్టీల ఉనికి గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వెపన్ లైసెన్స్‌లు తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. 2019 తరువాత జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు ఆయుధ లైసెన్స్‌లు తీసుకుని సంచరించారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత వారి నుండి ఆయుధాలను పోలీసులు వెనక్కి తీసుకున్నారు. టార్గెట్ కాకున్నప్పటికీ ఆయుధాలు వినియోగించి తమ దర్పాన్ని ప్రదర్శించాలనుకున్న వారి ఆటలను పోలీసులు కట్టడి చేశారు. ఇబ్బడి ముబ్బడిగా ఆయుధ లైసెన్స్‌లు ఇచ్చే విధానం మంచిది కాదన్న అభిప్రాయం పోలీసు అధికారులు బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో వెపన్ లెసెన్స్ తీసుకున్నా అవి శాశ్వతంగా మాత్రం వారి వద్ద ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పొలిటికల్ ప్రెజర్స్‌తో వెపన్స్ ఇచ్చే విధానాన్ని గమనించిన కొంతమంది, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారూ లేకపోలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి ఆయుధాలు ఇవ్వాలా వద్దా అన్న విషయాలపై సమగ్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ పోలీసు అధికారులకు ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

లేనట్టయితే వెపన్ లైసెన్స్ తీసుకున్న వారు దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవంగా లైసెన్స్ తీసుకుని ఆయుధం వినియోగించే వారు తమ వెంట లైసెన్స్ ఉంచుకోవడంతో పాటు, ఆయుధాన్ని బహిరంగంగా కనిపించే విధంగా వాడవద్దని నిబంధనలు చెప్తున్నాయి. కేవలం ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే తమ వద్ద ఉన్న గన్‌ను బయటకు తీయాలి తప్ప బాహాటంగా షో చేస్తూ దర్పం ప్రదర్శించడం, చీటికి మాటికి ఆయుధాన్ని చూపిస్తూ పరోక్షంగా ఎదుటి వారిలో భయం కల్పించడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్దం. ఇలాంటి తప్పిదాలు చేస్తే వెంటనే ఆయుధ లైసెన్న్ రద్దు చేసి వెపన్‌ను డిపాజిట్ చేసుకునే అధికారం పోలీసు అధికారులకు ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యర్ధులు ఆధారాలు కూడా పోలీసుల ముందు ప్రవేశపెడితే క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు చట్టాలను అనుకూలంగా ఉన్నాయి.


Next Story

Most Viewed