బీఆర్ఎస్ నేతలు చేసిన భూకబ్జాలకు పాత్రధారి,సూత్రధారి గంగుల కాదా..?: బేతి మహేందర్ రెడ్డి

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్ నేతలు చేసిన భూకబ్జాలకు పాత్రధారి,సూత్రధారి గంగుల కాదా..?: బేతి మహేందర్ రెడ్డి
X

దిశ బ్యూరో,కరీంనగర్ : గంగుల కమలాకర్ కనుసన్నల్లోనే కరీంనగర్ లో భూ కబ్జాలు జరిగాయని ఆనాటి అధికారులు సైతం అందుకు సహకరించారని . బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరిగిన భూ కబ్జాలపై గంగుల ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ లో భూముల రేట్లు విపరీతంగా పెరగడం తో బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.ప్రభుత్వ అండదండలతో ఆ పార్టీ నాయకులు గత పదేళ్లుగా సామాన్యులకు చెందిన ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూములను విడిచిపెట్టకుండా కబ్జాలకు పాల్పడ్డారని, ఈ భూ కబ్జాలను కాపాడాల్సిన కొంతమంది రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు భూకబ్జాదారులకే వంతపాడుతూ కమిషన్లకు కక్కుర్తి పడి, లంచాల మత్తులో మునిగి నారని ఆరోపించారు.అలాగే నాటి మంత్రి గా కొనసాగిన నేటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూకబ్జాలను అరికట్టవలసి ఉండగా అక్రమార్కులకే వంతపాడుతూ వారినే ప్రోత్సహించాడని ఆరోపించారు.

దీనికి సజీవ సాక్ష్యం మే భూకబ్జాల ఆరోపణలతో జైల్లో ఉన్న నిందితులతో గంగుల కమలాకర్ ములాఖత్ కావడమే ఇందుకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ లో అనేక ఏళ్లుగా చేసిన భూకబ్జాలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రూపంలో ఒక మంచి ఆఫీసర్ రావడం, శుభపరిణామం అన్నారు. వారు భూ ఆక్రమణలపై ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ (ఇ.ఓ.డబ్ల్యూ) పేర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసి బాధితుల నుండి తనే స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి, న్యాయ సలహాలు తీసుకుంటూ, అన్యాయంగా సామాన్యుల నుంచి దౌర్జన్యంగా లాక్కున్న భూములను ఇప్పిస్తుండటం పై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారని భూ మాఫీయాకు పాల్పడ్డ భూకబ్జాదారుల పై కేసులు పెట్టి జైలుకు పంపడానికి బీజేపీ పార్టీ స్వాగతిస్తూ సి.పి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు.

అలాగే జిల్లా పరిపాలనాధికారైన కలెక్టర్ గారు కూడ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లోని విలీన గ్రామాలతో పాటు కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేట్,అసైన్, సీలింగ్ భూములతో పాటు ఎస్ఆర్ఎస్పీ భూములను పరిరక్షించడానికి జిల్లా కలెక్టర్ ముందుకు రావాలని కోరారు. నీతి, నిజాయితీ గల స్ట్రిక్ట్ ఆఫీసర్లచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇదే కాకుండా ఇప్పటివరకు ఈ భూకబ్జాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి కమీషన్లు రూపంలో లంచాలు తీసుకున్న గతంలో పని చేసిన ఆర్.డి.ఓ, అలాగే కొంతమంది తహసీల్దార్ లతో పాటు క్రింది స్థాయి రెవెన్యూ అధికారులపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకొని కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధినపరుచుకోవాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా చేసుకొని భూకబ్జాలకు సంపూర్ణంగా సహకరించి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్న కొంతమంది పోలీస్ అధికారుల పై కేసులు పెట్టి వారిని సస్పెండ్ తో సరిపెట్టకుండా సర్వీస్ నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కరీంనగర్ సీపీకి బీజేపీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూన్నాము అన్నారు.

అలాగే భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నప్పుడు నిందితులను కోర్టు పర్మిషన్ తో కస్టడీలోకి తీసుకుని విచారించిన వాంగ్మూలాలను మీడియా సమావేశం పెట్టి కరీంనగర్ ప్రజలకు తెలిసేలా అందులోని పూర్తి వివరాలను బహిర్గత పర్చాలని కోరారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ ఆస్తులకే ఎసరు పెట్టిన వ్యక్తులకు అన్ని విధాలా అండగా నిలవడాన్ని చూస్తుంటే ఇందులో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని , అందుకే భూ బాధితులందరూ ఏకమై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.భూ బాధితులందరికీ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ మీడియా సమావేశంలో బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపాటి జితేందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి జేడీ భగవాన్,దళిత మోర్చ మాజీ నగర ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి సుమన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story