ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు : వివేక్ వెంకటస్వామి..

by Disha Web Desk 20 |
ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు : వివేక్ వెంకటస్వామి..
X

దిశ, గొల్లపల్లి : తప్ప, తాలు, తడిసిన ధాన్యంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని వివేక్ వెంకటస్వామికి రైతులు వినతిపత్రం అందించారు. బుగ్గారం మండలం శేకల్ల, మద్దునూర్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, మిల్లర్ల దోపిడీ గురించి తమ బాధను రైతులు చెప్పుకున్నారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దోపిడీకి గురి చేస్తున్నాయి. ప్రభుత్వ దోపిడిని ప్రజలు గమనిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం చేయకపోవడంతో బ్యాంకర్లు అకౌంట్లను ఫ్రీ చేశారు.

కళ్ళల్లో పోసిన వడ్లకు మొలకలు వచ్చాయ్, ఐకేపీ సెంటర్లు ముందే ప్రారంభించి వడ్లు కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటర్లు మునిగిపోతే రూ. 1200 కోట్లు ఏ విధంగా అందజేశారు. అదే విధంగా రైతులకు కూడా నష్టపరిహారం అందజేయాలన్నారు. ఎకరాకు రూ. 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయామని రైతులు వాపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కోసం కట్టాల్సిన రాష్ట్ర వాటా చెల్లిస్తే రైతులు నష్టపోయేవారు కాదన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కర్ణాటకలో ఫసల్ భీమా యోజన పథకం ఉండడంతో నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరింది. సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడతో రైతులను నష్టపోయేలా చేస్తున్నారు.

సెక్రటరీయెట్ రెండేళ్లలో కట్టిన సీఎం కేసీఆర్, రైతులకు రుణ మాఫీ చేయలేదు, తెలంగాణ రైతులను ఆదుకోవాల్సిన ధ్యాస లేదు కానీ పంజాబ్ మహారాష్ట్ర రైతులను ఆదుకుంటున్నారు. మన తెలంగాణలో దోచుకున్న డబ్బులను తీసుకెళ్లి వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు. సీఎం కేసీఆర్ కు కమిషన్లు వచ్చే వాటిపై ఉన్న ధ్యాస రైతులపై లేదన్నారు. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కుటుంబం ఉన్నట్లు చార్జ్ షీట్లో ఉందన్నారు. అందులో వచ్చిన డబ్బులతో భూములు కూడా కొనుగోలు చేశారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కనీసం రైతు ఐక్యవేదికను వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిర్మించిన రైతు ఐక్యవేదికలోనూ బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు దండుకున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఐక్య వేదికలకు తాళాలు వేశారన్నారు. తుగ్లక్ ప్రభుత్వం, తుగ్లక్ ఆలోచనలతో ప్రజలు విసుగు చెందారు అని అన్నారు. వారి వెంట బీజేపీ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed