కాంటాలు కాక అన్నదాతల తిప్పలు.. సమస్యలు పట్టించుకోని అధికార యంత్రాంగం

by Disha Web Desk 6 |
కాంటాలు కాక అన్నదాతల తిప్పలు.. సమస్యలు పట్టించుకోని అధికార యంత్రాంగం
X

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాక.. ధాన్యం అమ్ముకోలేక రోజుల తరబడి దిగాలుగా ఎదురు చూస్తున్నారు. ధాన్యం బస్తాలు తరలింపునకు లారీలు లేక.. ఒకవేళ కాంటా అయినా ధాన్యానికి మిల్లర్లు ఎడాపెడా పెడుతున్న కోతలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అన్నదాత పట్ల కనీస కనికరం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్​ బార్​ కిసాన్​ సర్కార్​ అంటున్న బీఆర్​ఎస్​ నేతలకు తమ నియోజకవర్గంలో అన్నదాతలు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండడం, అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాకపోవడంతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాక.. ధాన్యం అమ్ముకోలేక రోజుల తరబడి దిగాలుగా ఎదురు చూస్తున్నారు. లారీలు లేక.. కాంటాలు పూర్తికాక.. ఒకవేళ కాంటా అయినా ధాన్యానికి మిల్లర్లు ఎడా పెడా పెడుతున్న కోతలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీసం కనికరం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్​ బార్​ కిసాన్​ సర్కార్​ అంటున్న బీఆర్​ఎస్​ నేతలకు తమ నియోజకవర్గంలో అన్నదాతలు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

రైతుల అరిగోస..

యాసంగిలో వివిధ పంటలు సాగు చేసిన రైతులు ఈ ఏడాది అరిగోస పడుతున్నారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లగా మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక ఒకవైపు, అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం కాంటాలు ఎప్పుడు అవుతాయో తెలియని పరిస్థితి మరో వైపు నెలకొన్నది. కాంటాలు పూర్తయినప్పటికీ ఎప్పుడు మిల్లుకు తరలిస్తారో తెలియక.. తరలించినా మిల్లర్లు ఎన్ని కిలోల కోత విధిస్తాడో అర్థం కాని సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఇన్ని కష్టాలు పడుతున్నా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తిన విధంగా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్వింటాళ్‌కు 8నుంచి 10కిలోల కోత..

రైతులు యాసంగి సీజన్​లో పండించిన ధాన్యంలో తాలు, తప్ప ఉన్నాయంటూ మిల్లర్లు క్వింటాళ్లకు 8 కిలోల నుంచి 10 కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు 40 కిలోల అన్ని సంచులను వాడుతున్నారు. అన్ని సంచుల బరువు 750 గ్రాములు ప్రభుత్వం నిర్ణయించింది. బస్తా బరువు కలుపుకొని 40 కిలో 750 గ్రాములు వచ్చే విధంగా తూకం వేయాలి. కానీ, తప్ప, తాలు పేరుతో 40 కిలోల బస్తాకు రెండు నుంచి మూడు కిలోల వరకు ఎక్కువ తూకం వేస్తున్నారు. 40 కిలోల 750 గ్రాములకు బదులు 42 కిలో నుంచి 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తే ధాన్యం నాణత్య లేదనే సాకుతో క్వింటాళ్‌కు మొత్తంగా 8నుంచి 10కిలోల వరకు కోత విధిస్తున్నారు. లేదంటే ధాన్యాన్ని తిరిగి పంపిస్తామని రైతులను బెదిరిస్తున్నారు. మిల్లు దాకా వెళ్లిన ధాన్యాన్ని తిరిగి తీసుకొచ్చే పరిస్థితి లేక మిల్లర్లు చెప్పిన వరకు కటింగ్​‌కు రైతులు ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంటుంది.

స్పందించని అధికార పార్టీ నేతలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తప్ప, తాలు, తేమ పేరుతో మిల్లర్లు పెద్ద మొత్తంలో రైస్​ మిల్లర్లు ధాన్యం కోత విధిస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఒక్క నేత స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లు పెడుతున్న ధాన్యం కోతతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు రూ.కోట్లు నష్టపోతున్న ప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్వింటాళ్ల వడ్లకు 8 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతో కటింగ్​ చేస్తున్నా అధికార పార్టీ లీడర్ పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటో రైతులకు అర్థం కాని ప్రశ్న. కాంటాలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి లారీల కొరత ఉన్నప్పటికీ దాన్ని ఎలా అధిగమించాలనే ఆలోచన చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు కరువయ్యారు.

ప్రతిపక్షాల పోరాటం పత్రికలకే పరిమితం..

అకాల వర్షాలకు రైతులు నష్ట పోయినప్పటి నుండి ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వరకు ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న పోరాటాలు పత్రికలకే పరిమితం అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలుగా రైతులకు అండగా నిలిచి వారి తరుపు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. రైతుల పక్షాన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు అందించిన ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల పోరాటాలు కేవలం పత్రికలకే పరిమితం కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు మాత్రం కష్టాలు, నష్టాలు తప్పడం లేదు.

Next Story