​సాంకేతిక పరిజ్ఞానంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ : సీపీ గౌస్ ఆలం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-09 12:35:16  IST  )

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.

​సాంకేతిక పరిజ్ఞానంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ :  సీపీ గౌస్ ఆలం
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. మంగళవారం హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక తనిఖీల్లో కరీంనగర్ సిపి గౌస్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ.. రాష్ట్ర డీజీపీ ఆదేశాల ప్రకారం జిల్లాలో మరింత పారదర్శకమైన, పటిష్టమైన పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

జూన్ 15 లోగా 'సీసీటీఎన్‌ఎస్' అప్‌డేట్

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా సీసీటీఎన్‌ఎస్ 2.0 సరికొత్త 'ఈ-సాక్ష్య' అప్లికేషన్లను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీపీ తెలిపారు. జూన్ 15వ తేదీ లోపు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్ పోర్టల్‌లో ఆన్‌లైన్ చేస్తామని, ఎఫ్‌ఐఆర్‌లతో పాటు కేసు దర్యాప్తు పత్రాలను కూడా నిబంధనల ప్రకారం.. డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొత్త చట్టాల ప్రకారం.. డిజిటల్ సాక్ష్యాల సేకరణ ఎంతో కీలకమని, దీనిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.

​బ్యాంకుల్లో భద్రతా ఆడిట్.. నేపాలీ ముఠాలపై నజర్

​గత నెలలో జిల్లాలో జరిగిన దోపిడీ కేసును దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, జ్యువెలరీ షోరూమ్‌లలో సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

​హోటళ్లు, లాడ్జీలకు హెచ్చరిక

హుజూరాబాద్ సబ్‌డివిజన్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించామని, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నామని హెచ్చరించారు. ప్రతి హోటల్, లాడ్జీ యాజమాన్యం తమ వద్దకు వచ్చే అతిథుల వివరాలతో కూడిన వీక్లీ రిపోర్టును తప్పనిసరిగా పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, రాష్ట్రంలో నేపాలీ ముఠాల నేరాల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న నేపాలీ పౌరుల బయోడేటా, గుర్తింపు పత్రాలతో ప్రత్యేక డేటాబేస్‌ను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

​'నార్కోటిక్స్' నియంత్రణకు ప్రత్యేక డాగ్ స్క్వాడ్..

​డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లు, విస్తృత వాహన తనిఖీలు చేపట్టడమే కాకుండా, మత్తుపదార్థాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా 'నార్కోటిక్ డిటెక్షన్ డాగ్' సహాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక 'యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్స్' వాడుతున్నామని, ఎవరైనా డ్రగ్స్ వాడుతూ దొరికితే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

​మహిళా రక్షణకు 'షీ లీడ్స్', 'ఆపరేషన్ స్నేహ'

​మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ​క్షేత్రస్థాయిలో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతూ 'షీ లీడ్స్' కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. ​పాఠశాలలు, కళాశాలల్లో వేధింపుల నివారణకు 'ఆపరేషన్ స్నేహ' కింద ప్రతి పాఠశాలలోనూ 'షీ కంప్లైంట్ బాక్స్' ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేధింపుల గురించి నేరుగా చెప్పలేని విద్యార్థినులు ఈ బాక్సుల్లో ఫిర్యాదులు వేయవచ్చని, ప్రతి పాఠశాలకు ఒక మహిళా కానిస్టేబుల్‌ను కేటాయించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

​సీసీ కెమెరాల జియో ట్యాగింగ్..

​పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద 100 మంది కంటే ఎక్కువ జనాభా తిరిగే అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేశామని, దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని సీపీ తెలిపారు. పాడైపోయిన పాత సీసీ కెమెరాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కెమెరాలను జియో ట్యాగింగ్ ప్రక్రియ ద్వారా అనుసంధానిస్తున్నట్లు పేర్కొన్నారు. హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్స్,సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందని, వార్షిక తనిఖీల్లో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని సి పి గౌస్ ఆలం అభినందించారు. ప్రభుత్వ, డీజీపీ ఆశయాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు నేర రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఏసీపీ మాదవి, సి ఐ లు టి.కర్ణాకర్, రామకృష్ణ గౌడ్, పులి వెంకట్ గౌడ్, వి. శ్రీనివాస్,ఎస్ ఐ లు కె. స్వాతి, శేఖర్ రెడ్డి, తిరుపతి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story