నా మాటే శాసనం.. ప్రగతి భవన్‌తో లింకులు అంటూ హెచ్చరికలు

by Dishafeatures2 |
నా మాటే శాసనం.. ప్రగతి భవన్‌తో లింకులు అంటూ హెచ్చరికలు
X

దిశ, జగిత్యాల : బినామీ నుంచి ఎదురు దెబ్బ తిన్న ఆ రెవెన్యూ అధికారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టడం ఆయనకు పెద్ద లెక్కేమీ కాదని.. ఒకే ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సదరు అధికారికి ప్రగతి భవన్ నుంచి కూడా లింక్‌లు ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. సాధారణ అటెండర్ నుంచి అధికారి వరకు ఎవరైనా తన మాట వినాల్సిందేనన్న రీతిలో ఆయన వ్యవహరిస్తాడని లేనట్టయితే బదిలీ వేటు తప్పదన్న హెచ్చరికలు వెళ్లిన సందర్భాలు లేకపోలేదని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

వరమైన ధరణి..?

పట్టాదారులకు నరకం చూపిస్తున్న ధరణి ఆ అధికారికి మాత్రం వరంగా మారిందని అందులోని లోపాలను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన సెటిల్ మెంట్లు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుకుబడితో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సదరు అధికారికి భయపడి ఫిర్యాదు చేసే వారే ముందుకు రాలేని పరిస్థితి నెలకొందంటే ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రికార్డుల్లో నమోదు కాని భూములతో పాటు సమస్యాత్మకంగా ఉన్న స్థలాలే లక్ష్యంగా పావులు కదిపి వసూళ్ల పర్వానికి తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ధరణి ద్వారా ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ఏకంగా ఓ నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకున్నారని, వివిధ పార్టీలకు చెందిన వారిని టీం సభ్యులుగా చేసుకుని సెపరేట్ వ్యవస్థను నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. అధికార, విపక్ష పార్టీలకు చెందిన వారిని తనకు అనుకూలంగా మలుచుకుని భూముల రికార్డుల్లో తల దూర్చి కావల్సినంతా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ప్రగతి భవన్‌తో లింకులట..

సదరు అధికారి వ్యవహారాలకు అడ్డు వస్తే ఇక అంతే.. జిల్లాలోని అధికారులతో పాటు నాయకులకు వార్నింగ్ లు వెళ్లే వరకు చేరుకుందంటే ఆయన సొంత రాజ్యం, రాజ్యాంగం ఎలా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రగతి భవన్ నుంచి నేరుగా తనకు సంబంధాలు ఉన్నాయని తనపై వేలు పెడితే వేటు పడటం ఖాయమన్న సంకేతాలు వెళ్లాయంటే ఆయన ఏ స్థాయిలో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారో గమనించాలని ఓ రెవెన్యూ అధికారి 'దిశ'తో వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో ఉండే పెద్దలు ఎంతమేరకు ఆ అధికారితో సంబంధాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ జిల్లాలోని యంత్రాంగానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారన్నది మాత్రం నిజమని వివరించారు.

ముఖ్య నేతకూ..

జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధిని సైతం ఆయన వదల్లేదట. సదరు అధికారి తీరుతో జిల్లాలో డ్యామేజ్ అవుతోందని కట్టడి చేయాలని ముఖ్య ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించిన విషయంపై గతంలో జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ నోటా ఈ నోట సదరు అధికారి చెవిన కూడా ఈ విషయం పడడంతో సమయం కోసం ఎదురు చూస్తున్న ఆయన చేతికి ముఖ్య ప్రజాప్రతినిధికి సంబంధించిన ఫైల్ రాగానే అది ముందుకు వెళ్లకుండా వెనక్కి రాకుండా హోల్డ్‌లో పెట్టించారట. ఆ స్థాయి నాయకున్నే ఇబ్బందులకు గురి చేశాడంటే ప్రగతి భవన్ లింక్స్ నిజమే కావచ్చని జిల్లా అంతటా ప్రచారం జరిగింది. దీంతో ఆయన వైపు వేలు చూపెట్టాలన్నా జంకుతున్న పరిస్థితి తయారైంది.

బినామీలెందరో..

ఒక్క బినామీ షాక్ ఇవ్వడంతో తల పట్టుకున్న సదరు అధికారి గురించి 'దిశ'లో కథనం రావడంతో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు పది మంది వరకూ బినామీలను ఏర్పాటు చేసుకుని రూ. కోట్లు విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నాడని చెప్తున్నారు. ఈ రోజు వచ్చిన వార్తతో మిగతా వారు కూడా హ్యాండ్ ఇస్తే ఎలా అని కలవరపడిపోతున్నారట సదరు అధికారితో పాటు అతనికి వంతపాడే వారంత. హైదరాబాద్ శివార్ల నుంచి జగిత్యాల వరకు ఆస్తులు కూడబెట్టిన సదరు అధికారిపై అన్ని కోణాల్లో ఆరా తీస్తే భారీ స్కాం వెలుగులోకి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed