రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 6 గంటల సమయం

by Aamani |
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 6 గంటల సమయం
X

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుతుండటంతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

క్యూలైన్లలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..

అధిక రద్దీకి తోడు వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు చల్లని తాగునీరు తో పాటు 5వేల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచి భక్తులకు అందజేస్తున్నారు.

ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆలయ ఇంచార్జ్ ఈఓ..

మరోవైపు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వయంగా ఇంచార్జ్ ఈ.వో రామకృష్ణ రంగంలోకి దిగారు. ఆలయ పరిసరాలన్ని కలియతిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్ల దగ్గరికి వెళ్లి భక్తులతో మాట్లాడారు. అక్కడ వేచి ఉన్న భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.

Next Story

Most Viewed