ఎల్ఎండికీ స్థిరంగా వరద.. ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

by Aamani |
ఎల్ఎండికీ స్థిరంగా వరద.. ప్రాజెక్టులోకి  కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
X

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలాశయం పూర్తి స్థాయి లో జలకళను సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పాటు మిడ్ మానేరు జలాశయం నుంచి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండడంతో ఎల్ఎండి నిండుకుండను తలపిస్తుంది. ఈ తరుణంలో ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీటిని ఏ క్షణానైనా విడుదల చేసేందుకు ఎస్సారెస్పీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

24 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరువలో నిల్వ..

ఎల్ఎండి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.030 టీఎంసీలు కాగా 25 రోజుల క్రితం వరకు కూడా ప్రాజెక్టులో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్న పరిస్థితి ఉండగా మిడ్ మానేరు జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీరు రావడంతో పాటు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 23 టీఎంసీలకు చేరువలో ఉంది.

ఏ క్షణాన్నైనా నీటి విడుదల..

మిడ్ మానేరు జలాశయం నుంచి ఎల్ఎండి జలశయానికి గత రెండు రోజులుగా దాదాపు 24 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రాజెక్టులోకి మిడ్ మానేరు, రివర్ నుంచి దాదాపు 12 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరొక టీఎంసీ వచ్చి చేరితే చాలు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండుతుండగా అప్రమత్తమైన ఎస్సారెస్పీ అధికారులు ఏ క్షణానైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రానికి లేదా మంగళవారం ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది.

Next Story

Most Viewed