'ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. పూర్వ విధానం అమలు చేయాలి'

by Disha Web Desk 13 |
ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. పూర్వ విధానం అమలు చేయాలి
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: ధరణి వెబ్ సైట్‌ను పూర్తిగా రద్దు చేసి పూర్వ విధానాన్ని అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ధరణి వెబ్ సైట్‌ పేరుతో రికార్డులను నిర్వహించే బాధ్యత ఒక విదేశీ కంపెనీకి అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు భూమి రికార్డుల నిర్వహణ పూర్తిగా సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఆధీనంలో ఉండేదని, ఇప్పుడు కూడా పూర్వం విధానాన్ని అమలు చేసి, ధరణిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంట భూమిని జాబితా నుంచి తొలగించి, గ్రామపంచాయతీ సభలో ఆయా గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు. అటవీ భూములు 2006 సంవత్సరంలో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం.. అందరికీ భూమి హక్కు కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకురావాలని, అదేవిధంగా పట్టా భూమి యజమానికి ఏ విధమైన చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2004 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశాడు. ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి, రాష్ట్ర శాసనసభలో వెంటనే భూమి టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Next Story