రాజన్న ఆలయ సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Aamani |
రాజన్న ఆలయ సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ,వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తో పాటు పట్టణాన్ని కనీవినీ ఎరగని రీతిలో తీర్చిదిద్దుతామని, ఆలయాన్ని, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి జరగాలన్నదే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయం, వేములవాడ పట్టణ అభివృద్ధి పై ఆదివారం ఆలయ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో పాటు మున్సిపల్, దేవాలయం, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆది మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి జరిపే తీరుతెన్నులను, ప్రభుత్వ లక్ష్యాలను తెలిపారు.

ఇప్పటికే జరిగిన అభివృద్ధికి తోడుగా రాబోయే రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి, రాజన్న భక్తులకు, పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాజన్న ఆలయ విస్తీర్ణం పెంచి, భక్తులకు శీఘ్ర దర్శనం, అధునాతన స్థాయిలో గోశాల, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి గదుల నిర్మాణం వంటి ఏర్పాట్లతో పాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంతో పాటు పట్టణంలో తిప్పాపూర్ వంతెన నుండి రాజన్న ఆలయం ముందు వరకు రోడ్డు వెడల్పు, మూలవాగు లోకి మురుగు నీరు చేరకుండా చర్యలు, పెండింగ్ లో ఉన్న వంతెన నిర్మాణం పూర్తి చేయడం, అధునాతన సౌకర్యాలతో కూడిన కూరగాయల మార్కెట్లను నిర్మించి వేములవాడ పట్టణాన్ని రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా చేస్తామని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి చేసే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed