'అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం'

by Disha Web Desk 20 |
అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల అమరుల స్థూపం వద్ద అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పాల్గొని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ తొలి, మలి, తుదిదశ ఉద్యమాల్లో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనేక మంది త్యాగధనులు ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.

1969 లో ఉవ్వెత్తున వచ్చిన ప్రజా ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ప్రజలలో ఉన్నప్పటికీ, దానికి ఒక వేదిక కల్పించి 2001లో ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. 14 ఏళ్లపాటు శాంతియుతంగా ఉద్యమ పందాతో ముందుకు తీసుకొని వెళ్లారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దాదాపు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారని యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానం చేసుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని చీఫ్ విప్ పేర్కొన్నారు.

అమరుల త్యాగంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అన్ని రంగాలలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచేవిధంగా తీర్చిదిద్దామని, గత 20 రోజులుగా వివిధ శాఖల నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను, వచ్చిన మార్పులను వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు.

పెద్దపల్లి జిల్లా పరిధిలో రాష్ట్ర సాధన కోసం 37 మంది ప్రాణాలకు సైతం లెక్కచేయ కుండా ఆత్మ బలిదానం చేసుకున్నారని, వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాలకు ఆసరాగా, అండగా సీఎం కేసీఆర్ నిలిచారని ఆయన తెలిపారు. అమరుల ఆశయాల సాధన దిశగా మనమంతా కృషి చేయాలని, వారి ఆశయాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ ఆ దిశగా రాష్ట్ర ప్రయాణం జరగాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తూ అద్భుత పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయులు అందించిన సహాయ, సహకారాలు, స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీకి తాకే విధంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు నిప్పు కనికల్లాగా పాల్గొని పోరాడారని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్పించారని, ఒంటి పై నిప్పుతో కాలుతున్నప్పటికీ శ్రీకాంతాచారి జై తెలంగాణ నినాదం పలికారని తెలిపారు. అలాగే పెద్దపల్లి ప్రజలు కూడా జిల్లా ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం అని, అనేక మంది ఉద్యమకారులు చేసిన త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని, వీరి త్యాగాలను మనం నిరంతరం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన తెలిపారు.

అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అమరవీరుల కుటుంబాల వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల కుటుంబాలతో కలిసి శాసనమండలి చీఫ్ విప్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబసభ్యులు, అదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జూలపల్లి జడ్పీటీసీ లక్ష్మణ్, శ్రీరామ్ పూర్ జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీ రావు, మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed