రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 23 |
రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ,జగిత్యాల ప్రతినిధి : రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తుందని అందుకే మోడీ 400 సీట్లు అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కావని గతంతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న 18వ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో భిన్నమైన ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేసారో మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండా మోడీ ఓట్లు అడుగుతున్నాడని అనుకున్న సీట్లు వస్తే రాజ్యాంగం మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేసి దేశాన్ని అంబానీ, అదానీలకు మోడీ అమ్మేందుకు చూస్తున్నాడని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులు,గిరిజనులు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకుంటే బిజెపి వాటిని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందన్నారు. దేశంలో వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ ల జీవితాల్లో రావాల్సిన స్థాయిలో మార్పులు రాలేదని కాబట్టే సామాజిక స్పృహ తో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.

సాయంత్రం ఐదు గంటలకు ఆధారాలన్నీ ఇస్తా..

రిజర్వేషన్లను సమూలంగా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను జాగృతం చేస్తూ బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే మోడీ, అమిత్ షాలు పగ తో ఢిల్లీ లో కేసు పెట్టారని అరోపించారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో గత పదేళ్లుగా కార్యకర్తలపై కేసులు, అక్రమ అరెస్టులు, హత్యలు చేసినా భయపెట్టాలని చూస్తే కేసీఆర్ ను ఇంటికి పంపించామన్నారు. దేశ ప్రధానిగా మోడీని గౌరవిస్తానని, కానీ గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తిడుతూ, శాపిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.సాయంత్రం ఐదు గంటలకు రాజ్యాంగ రద్దు అంశాలను ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరిస్తానని చెప్పారు.

కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే..

గతంలో కాంగ్రెస్ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ కారిడార్, ఐఐటీ, పాలమూరు ఎత్తిపోత పథకానికి జాతీయ హోదా వంటి అంశాలను మోడీ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రాజ్యాంగం, రిజర్వేషన్ రద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు మెట్రో అనుమతి, నీళ్ల కేటాయింపులు ఇవ్వలేదన్నారు. గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. భయాందోళనలకు గురి చేస్తూ రాజ్యాధికారం చేస్తే నిజం నవాబులకు పట్టిన గతి పడుతుందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు అంశాలను ప్రజలకు చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ని గెలిపించండి..

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరిక మేరకు నిజామాబాద్ సీటును అధిష్టానం కేటాయించిందన్నారు. జీవన్ రెడ్డికి లక్ష పైచిల మెజారిటీ తో గెలిపించే బాధ్యత మీదని, లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు, మామిడి పరిశోధన కేంద్రం, హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ బహిరంగ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ మంత్రులు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story