చేతకాదని చెబితే షుగర్ ఫ్యాక్టరీని మేమే తెరిపిస్తాం: Bandi Sanjay

by Dishanational1 |
చేతకాదని చెబితే షుగర్ ఫ్యాక్టరీని మేమే తెరిపిస్తాం: Bandi Sanjay
X

దిశ, మల్లాపూర్: మండలంలో గల షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైందని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం చేతకాదు అని కేసీఆర్ రాసి ఇస్తే, ప్రధాని మోడీని కలిసి ఇక్కడి రైతుల బాధలు చెప్పి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తానదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. 5వ విడత పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బండి సంజయ్ అనంతరం రాఘవపేట గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ఇప్పటివరకు 51 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో అభిమానంతో... పూలు జల్లి, సన్మానిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని అన్నారు. వంద రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని, కేసీఆర్ బిడ్డ కవిత రూ. లక్ష కోట్లు పెట్టి సారా దందా చేసిందని, క్యాసినో, సారా దందాలు కవితవేనని అన్నారు. దొంగ దందాలు చేయడానికి రూ. లక్ష కోట్లు పెడతారు కానీ రూ. 250 కోట్లు పెట్టి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేరా అని ప్రశ్నించారు. దేవుడికే శఠగోపం పెట్టినోడు కేసీఆర్ అని, వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. వంద కోట్లు అన్నాడు... ఒక్క పైసా ఇవ్వలేదని, బాసర ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయలని, ఒక్క పైసా ఇవ్వలేదని, ఇప్పుడు కొండగట్టుకు రూ. 100 కోట్లు అని అంటున్నాడని ఏద్దేవా చేశారు.

కేసీఆర్ దగ్గినా... తుమ్మినా తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటారని, తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం నిజమని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని తాను నిరూపిస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటూ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండని, నేడు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల జాడ లేదని, ప్రజలకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసింది పేదోళ్లు.. బలిదానమైంది పేదోళ్లు అని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేయలేదని, పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో... పెద్దోడు రాజ్యమేలుతున్నారని అన్నారు. మన బతుకులు బాగుపడాలంటే... భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. మనకి నిధులు, నియామకాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే.. మోడీ లాంటి నాయకత్వం కావాలని పేర్కొన్నారు.


Next Story

Most Viewed