- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒంటరైన రాములోరు !

దిశ, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఒంటరివాడయ్యాడు. నిత్య పూజలు అందుకుంటూ విలసిల్లుతూ ఉండే రామాలయం బోసిపోయింది. ఎప్పుడు భక్తులతో కళకళలాడుతూ ఉండే ఆలయం ఇప్పుడు దిక్కులేనిది అయ్యింది. సంవత్సరాలు గడుస్తున్నా ఆలయ నిర్మాణ పనులు చేపట్టకుండా సింగరేణి అధికారులు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. రామగుండం 3 ఏరియా ఓసీపీ2 విస్తరణలో భాగంగా లద్నాపూర్ గ్రామంలో సగభాగాన్ని 2015లో సింగరేణి సంస్థ సేకరించింది. అనంతరం లద్నాపూర్ గ్రామస్తులకు రత్నాపూర్, పన్నూర్ పరిధిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. గ్రామం తరలింపు కూడా 90 శాతానికి పైగా పూర్తి అయ్యింది. అంతే కాకుండా ఇండ్లను సైతం నేలమట్టం చేశారు. పునరావాస కేంద్రంలోనే గుడి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినా పనులకు నోచుకోలేదు. సింగరేణి యాజమాన్యం రామాలయంతో పాటు కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్, పలునిర్మాణాలను పూర్తి చేసి అప్పజెప్పాల్సి ఉంది. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ఏవేవో సాకులు చెబుతూ ఆలయ నిర్మాణ పనులు కనీసం ప్రారంభించలేదు. గ్రామమంతా ఖాళీ అయ్యాక ఆలయం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. మరో వైపు ఈ ఆలయానికి అతి సమీపంలో బ్లాస్టింగ్ చేపడుతున్నారు. బ్లాస్టింగ్ వల్ల ఏర్పడే వైబ్రేషన్ తో ఆలయానికి ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని గ్రామస్తులు తెలిపారు.
ఓం వైపు బ్లాస్టింగ్ లు.. మరో వైపు రక్షణలేమి..
శ్రీ సీతా రామాలయానికి ప్రమాదం పొంచి ఉంది. ఆలయానికి అతి సమీపంలో బ్లాస్టింగ్లు చేపడుతున్నారు. బ్లాస్టింగ్ల వల్ల ఏర్పడే వైబ్రేషన్ తో ఆలయానికి ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు రామాలయం చుట్టూ నిర్మించిన ప్రహరీ పలు కారణాలతో కూలిపోవడంతో సిమెంట్ బిల్లలతో తాత్కాలికంగా అడ్డుపెట్టి వదిలేశారు. ఆలయ సమీపంలో ఎవరూ లేకపోవడంతో విగ్రహాల రక్షణపై అనుమానం నెలకొంది. కొన్ని రోజుల క్రితం లద్నాపూర్ గ్రామంలోనే ఎల్లమ్మ ఆలయంలో దొంగలు హుండీ పగులగొట్టి సొమ్ము ఎత్తుకెళ్లారు. దీంతో ఆలయంలోని విగ్రహాలకు భద్రత ఉందా అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయానికి అతి సమీపంలో భూమికి పగుళ్లు..
ఆలయానికి అతి సమీపంలోనే బ్లాస్టింగ్ లతో భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. మంథని -పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కనే భారీ స్థాయిలో బ్లాస్టింగులు చేపడుతూ కనీసం ఆలయానికి రక్షణ చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి అధికారులకు ఇండ్లను కూలగొట్టడం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో ఎందుకు లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులను ఆలయ నిర్మాణం పై ప్రశ్నిస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ త్వరలో ప్రారంభిస్తామని దాటవేత ధోరణి సమాధానాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అజాగ్రత్తగా ఉండి అనుకోని ఘటన ఏదైనా జరుగక ముందే తగిన చర్యలు తీసుకుని గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆలయ నిర్మాణ పనులు త్వరగా చేపట్టండి.. సముద్రాల శ్రీకరాచారి, ఆలయ అర్చకుడు
సింగరేణి అధికారులు గ్రామాన్ని మొత్తాన్ని తరలించి ఆలయాన్ని వదిలేశారు. ఆలయ నిర్మాణం పై అడిగితే సరైన స్పందన లేదు. ఇప్పటికైనా ఆలయానికి కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు త్వరగా చేపట్టి పనులు పూర్తి చేయాలి.
సింగరేణి అధికారులు అలసత్వం వీడాలి.. మాజీ సర్పంచ్ లద్నాపూర్
పునరావాస కేంద్రంలో రామాలయం, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, హెల్త్ సెంటర్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా.. అలసత్వం ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండగా గ్రామాన్ని మొత్తం ఖాళీ చేయించారు. త్వరగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలి. అలాగే కొన్ని ఇండ్లకు ఇంకా పరిహారం అందలేదని, పరిహారం అందేలా చూడాలి.