చెరువు మట్టి తవ్వకాల తీరుపై విమర్శలు.. ఇచ్చింది ఎంత? తవ్వింది ఎంత..?

by Dishafeatures2 |
చెరువు మట్టి తవ్వకాల తీరుపై విమర్శలు.. ఇచ్చింది ఎంత? తవ్వింది ఎంత..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అనుమతులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం ఇరిగేషన్ అధికారులకు సాధారణంగా మారిపోయినట్టుంది. తాము ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించే వారే లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇరిగేషన్ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మండలంలోని దుండ్రపల్లి గ్రామంలోని ఊర చెరువు నుండి మట్టిని తీసుకెళ్లేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇచ్చారు. కేవలం 500 క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ నెల 11న లేఖను పంపించారు. ఓ బ్రిక్స్ తయారీ నిర్వాహాకులను అనుమతి ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే సంబంధిత ఇంజనీర్లు ఊర చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకున్న వారు ఏకంగా రెండు జేసీబీలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టిప్పర్లలో మట్టిని తరలించుకుపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు మట్టి సేకరించుకుపోయారని వారు వివరించారు. వాస్తవంగా సాయంత్రం 6 గంటలలోపే చెరువులో మట్టి తవ్వకాలు జరపాలని పర్మిషన్ లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ నిర్వహాకులు రాత్రి పగలు అన్న తేడా లేకుండా మట్టిని తరలించుకుపోయారన్నారు.

500 క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకెళ్లేందుకు రెండు మిషన్లను ఏర్పాటు చేస్తే ఎన్ని రోజుల్లో తరలించవచ్చన్న అంచనాలను కూడా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకున్న వారు మాత్రం దర్జాగా ఆదివారం రాత్రి వరకు తమ పనిని సాఫీగా చేసుకుని పోతూనే ఉన్నారు. దీంతో గ్రామస్థులు చెరువులోకి వెళ్లి మట్టిని మిషనరీ, వాహనాల డ్రైవర్లను నిలదీయడంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. లేనట్టయితే ఇప్పటికీ అలాగే మట్టిని తరలించుకుపోయేవారని గ్రామస్థులు అంటున్నారు.

సాకు అదేనా..?

అయితే ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన లేఖలో 15 రోజుల్లోగా అనుమతించిన మేరా మట్టిని తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ సాకును అడ్డుగా పెట్టుకున్న నిర్వహాకులు 500 క్యూబిక్ మీటర్లు దాటినా నిరంతరం మట్టిని తరలించుకపోవడమే పనిగా పెట్టుకున్నారని స్థానికులు ఆరోపించారు. కేవలం మీటరు లోతు మించి మట్టి సేకరణ జరపవద్దని కూడా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దాదాపు 1.5 మీటర్ల పైనే తవ్వకాలు జరిపారని వివరించారు. అలాగే పేరుకు 500 క్యూబిక్ మీటర్ల అనుమతి తీసుకుని చెరువు మట్టిని పెద్ద ఎత్తున తరలించుకుపోయిన నిర్వహాకులు ఇరిగేషన్ కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తప్పించుకున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

స్థానికులు స్పందించకపోతే..

అయితే రెండు రోజుల క్రితం దుండ్రపల్లి ఊర చెరువులో మట్టి తవ్వకాలు అర్ధరాత్రి వరకూ జరుగుతున్నాయని అడ్డుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏర చెరువు మట్టి తవ్వకాల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. గ్రామస్థులు అడ్డుకోనట్టయితే పర్మిషన్ లెటర్ చూపిస్తూ మరిన్ని రోజుల పాటు ఇలాగే తరలించుకుపోయే వారని వారంటున్నారు. అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేసినట్టయితే కేవలం ఒకటి రెండు రోజుల్లోనూ పర్మిషన్ మేరా మట్టి తరలించుకుపోయారని నిలువరించే వారు కానీ వారెవరూ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మట్టిని తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు మిషనరీల సామర్థ్యంతో ఎన్నింటిని వాడాలి అన్న వివరాలు కూడా పొందుపరిస్తే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల అక్రమ తవ్వకాలకు బ్రేకు పడే అవకాశాలు ఉంటాయని వారంటున్నారు. అయితే తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి తీసుకున్న నిర్వాహకులు, మిషనరీ, వాహనాల డ్రైవర్లను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అంతేకాకుండా పర్మిషన్ తీసుకున్న నిర్వాహకులు తరలించిన మట్టిని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, డిసిల్ట్రేషన్ జరిగిన చెరువును పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story