ఖజానాకు కన్నం.. ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో ఇష్టారాజ్యం

by Disha Web Desk 4 |
ఖజానాకు కన్నం.. ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో ఇష్టారాజ్యం
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలోని అధికారుల పనితీరు కంచె చేను మెసిందన్నట్టు తయారైంది. జీహెచ్‌ఎంసీ నుంచే జీతాలు తీసుకుని సంస్థ ఖజానాకు కన్నంవేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి, ఇక్కడ సకల సౌకర్యాలు పొందుతూ జీతం కూడా జీహెచ్ఎంసీ నుంచే తీసుకుంటూ సంస్థకు రావల్సిన ఆదాయం రాకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇంజినీరింగ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చే ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు, మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే ట్రేడ్ లైసెన్స్‌ల జారీని పట్టించుకోకుండా, నామమాత్రపు ఛార్జీలకు ప్రొవిజినల్ ట్రేడ్ లైసెన్స్‌లను జారీ చేస్తున్నట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం నామమాత్రపు ఛార్జీలకు ప్రొవిజినల్ లైసెన్స్‌ను జారీ చేసి, ఆ తర్వాత ఆ సంస్థను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ట్రేడ్ ఇండెక్స్‌నెంబర్ (టిన్)ను కేటాయిస్తే సదరు వ్యాపార సంస్థ క్యాటగిరీని బట్టి ఏటా జీహెచ్ఎంసీకి ట్రేడ్ ఫీజులు వస్తుంటాయి. కానీ గడిచిన మూడేళ్లుగా ఈ తంతును కేవలం ప్రొవిజినల్ వరకే పరిమితం చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు టిన్ కేటాయించే విధులు నిర్వర్తించటం లేదు. అయినా అధికారులు వీరిని ప్రశ్నించడం లేదు.

వేలల్లో పేరుకుపోయిన దరఖాస్తులు

ప్రతీఏటా అన్ని జోన్ల కంటే ఖైరతాబాద్ జోన్‌లోనే ట్యాక్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్ అవుతోంది. ఈ జోన్‌లో కమర్షియల్ ఎస్టాబిలిష్‌మెంట్లు ఎక్కువే. కానీ ఇక్కడ ట్రేడ్ లైసెన్సుల జారీ ఇతర సర్కిళ్ల మాదిరిగానే కేవలం ప్రొవిజినల్‌కే పరిమితమైంది. గడిచిన మూడేళ్లుగా ఇక్కడి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ (ఏఎంఓహెచ్) ఒకరు తానే లైసెన్సింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ, తనకు నచ్చిన, తాను కోరిన విధంగా అమ్యామ్యాలు చెల్లించే వారికే ప్రొవిజినల్ ట్రేడ్ లైసెన్సులను జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తూ, తొలుత ప్రొవిజినల్, ఆ తర్వాత తనిఖీలు చేసి టిన్‌తో కూడిన ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తే ఏటా కోట్ల రూపాయలు ఈ ఒక్క జోన్ నుంచే వచ్చే అవకాశమున్నా, ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ముందు నోటీసులు...తర్వాత కాసులు

అంబర్‌పేట సర్కిల్‌లో ట్రేడ్ లైసెన్స్ ప్రొవిజినల్‌తో పాటు మెస్‌లు, హాస్టళ్ల ట్రేడ్ లైసెన్స్‌ల వ్యవహారం అధికారులకు కోట్ల అక్రమార్జన చేకూరుస్తోంది. ఇక్కడి మెడికల్ ఆఫీసర్, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై వన్ పాయింట్ ప్రొగ్రాంగా హాస్టల్స్, మెస్‌లు వంటి వాటికి నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత టిన్‌తో కూడిన లైసెన్స్ జారీ చేస్తామంటూ తనిఖీలకు వెళ్లి, అందినంత దోచుకుని కేవలం ప్రొవిజినల్ జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు, మూడు అంతస్తులున్న హాస్టళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీలో కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వివరాలను నమోదు చేసి, మిగిలిన రెండంతస్తులకు బేరం కుదుర్చుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. సుమారు 20 ఏళ్ల నుంచి బదిలీల్లేకుండా ఇక్కడ తిష్టవేసిన ముగ్గురు ఉద్యోగులు రింగ్‌గా ఏర్పడి ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. నెలల క్రితం ఓ హాస్టల్‌కు నోటీసు జారీ చేసి, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహించటమే ఇందుకు నిదర్శనం.

కమిషనర్‌కు పట్టదా?

ఆస్తిపన్ను కలెక్షన్‌లో అత్యధికంగా వచ్చేది ఖైరతాబాద్ జోన్ నుంచే. ప్రతి రోజు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలంటూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే కమిషనర్ ఇక్కడ ట్రేడ్ లైసెన్స్‌ల ఛార్జీలెందుకు తక్కువగా వస్తున్నాయన్న విషయంపై దృష్టి సారించరంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని కమిషనర్ కనీసం ఆర్థిక సంక్షోభం నుంచి కార్పొరేషన్‌ను గట్టెక్కించేందుకు తనవంతు కృషిగా మొత్తం నగరంలో ట్రేడ్ లైసెన్సులను టిన్‌తో జారీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే కొన్ని కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయని పలువురు కార్పొరేషన్ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read..

వివాదాస్పదంగా స్టాండింగ్ కమిటీ తీరు!



Next Story