జేపీఎస్‌ల సమ్మె విరమణ.. తక్షణం విధుల్లో చేరుతున్నట్లు ప్రకటన

by Disha Web Desk 2 |
జేపీఎస్‌ల సమ్మె విరమణ.. తక్షణం విధుల్లో చేరుతున్నట్లు ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గత నెల 29 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌తో పునరాలోచనలో పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్.. తక్షణం విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సామరస్యంగానే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన డెడ్‌లైన్‌లో 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా చేరాలని ఆ శాఖ వార్నింగ్ ఇచ్చింది. విధులకు హాజరుకాకపోతే వారిని టెర్మినేట్ చేస్తామని హెచ్చరించింది. కానీ ఆ నోటీసులను బేఖాతర్ చేసిన జేపీఎస్‌లు సమ్మెను కొనసాగించారు.

ఈ సమ్మెను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఆ ప్రకారం శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా విధుల్లో చేరనివారు అనధికారికంగా గైర్హాజరైనట్లుగా భావించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబోమని స్పష్టం సీఎస్ చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఉంటున్న గ్రాడ్యుయేట్లను కొన్ని షరతులకు లోబడి తాత్కాలిక పద్ధతిలో జేపీస్‌లుగా నియమించుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్న టైమ్‌లోనే జేపీఎస్‌లు పునరాలోచించుకుని ఎలాంటి షరతుల్లేకుండా తక్షణం విధుల్లో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపినా భవిష్యత్తు ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని రాజీకి వచ్చినట్లు పలువురు జేపీఎస్‌లు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల ప్రొబేషన్ గడువు పూర్తయిన జేపీఎస్‌ల సర్వీసును క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌తో వారు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed