జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు మినహాయింపు ఇవ్వాలి: TWJF

by Disha Web Desk 19 |
జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు మినహాయింపు ఇవ్వాలి: TWJF
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ ఫీజు నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు నేషనల్ హైవే అథారిటీ సంస్థను కోరింది. శుక్రవారం ఫెడరేషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఆ సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు వల్ల ఆర్థిక భారం పడుతుందని, న్యూస్ కవరేజీ కోసం హైవేలపై ప్రయాణించే జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫెడరేషన్ ప్రతినిధులు వివరించారు.

అక్రెడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యం ఉన్నప్పటికీ రాయితీలో టోల్ ఫీజు పడుతుందని, దీని వల్ల మూడోవంతు రాయితీ తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మాదిరిగానే జర్నలిస్టులకు కూడా టోల్ గేట్ ఫీజు వసూలు చేయకుండా ఉచిత ప్రవేశం కల్పించాలని తాము చాలా రోజులుగా కోరుతున్నామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి జర్నలిస్టులకు టోల్ ఫీజు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ... ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, జి. రఘు, హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story