రాంగ్ బబ్లింగ్‌తో ప్రిలిమ్స్ క్వాలిఫై ఎలా సాధ్యం?

by Dishafeatures2 |
రాంగ్ బబ్లింగ్‌తో ప్రిలిమ్స్ క్వాలిఫై ఎలా సాధ్యం?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో రాంగ్ బబ్లింగ్ చేసినా క్వాలిఫై అవుతారా? అనే ప్రశ్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో తెరమీదకు వచ్చింది. పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడిగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ నిర్వాకంతో టీఎస్పీఎస్సీ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ వ్యవహరంలో ప్రవీణ్‌తో పాటు టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే టౌన్ ప్లానింగ్ పరీక్షకు చెందిన పేపర్ లీక్ కాగా, తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపేపర్ కూడా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు నిరుద్యోగులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ కు సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 మార్కులకు గానూ 103 మార్కులు వచ్చాయని, ఈ పేపర్ కూడా లీకైందని అంటున్నారు.

అయితే, ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ లో ఓ తప్పిదం చేశాడు. ఓఎంఆర్ షీట్ లో రాంగ్ బబ్లింగ్ చేశాడు. క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ బబ్లింగ్ చేసే క్రమంలో ప్రవీణ్ పొరపాటు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిరుద్యోగులు షేర్ చేస్తూ ‘103 మార్కులు సరే...అసలు రాంగ్ బబ్లింగ్ చేసిన పేపర్ ఎలా కరెక్షన్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. రాంగ్ బబ్లింగ్ చేస్తే క్వాలిఫై ఎలా సాధ్యం అంటూ మండిపడుతున్నారు. ఇందులో ప్రవీణ్ తో పాటు టీఎస్పీఎస్సీ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు’. కాగా, గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా, జనవరి 13న ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 2.60 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో సుమారు 26 వేల మంది క్వాలిఫై అయ్యారు. జూన్5 నుండి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకవేళ గ్రూప్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైతే ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్ధుల పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.

Next Story