శ్వేత సౌధంలో సేదతీరితే సరిపోదు..సీఎం కేసీఆర్‌పై బండి ఫైర్

by Rajesh |
శ్వేత సౌధంలో సేదతీరితే సరిపోదు..సీఎం కేసీఆర్‌పై బండి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేత సౌధంలో సేద తీరితే సరిపోదని, ప్రజల, ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. ఇకనైనా మొద్దునిద్ర వీడి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఆరు రోజులుగా రాష్ట్రంలోని 9350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నా సీఎం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని మరిచిపోయారా? అని గుర్తుచేశారు?

నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం నాడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయని, కానీ పోటీ పరీక్షల్లో రాసి అర్హత సాధించి ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయి నాలుగేళ్లు దాటినా వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినప్పటికీ అన్నింటినీ భరిస్తూ వారు విధులు నిర్వర్తించారని తెలిపారు. గడువు దాటినా నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణంగా పరిగణించారు.

పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర వహిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులైన నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్లతో పాటు పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని చెప్పారు.

వారితో రోజుకు 12 గంటలకుపైగా పని చేస్తున్న వీరితో వెట్టిచాకిరి చేయించుకున్నారే తప్ప నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణమని బండి సంజయ్ ఫైరయ్యారు. పైగా రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులకు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మధ్య వైరం పెట్టేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల పలువురు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రొబేషనరీ కార్యదర్శులు సమ్మె చేసే దుస్థితి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని లేదంటే తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు. లేదంటే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story